డిజిటల్ అరెస్ట్ అంటూ… హైదరాబాద్‌లో రూ. 53 లక్షలు లూటీ

V. Sai Krishna Reddy
1 Min Read

నగరంలో సైబర్ నేరగాళ్లు మరోసారి విజృంభించారు. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో సరికొత్త మోసానికి పాల్పడి, అమీర్‌పేటకు చెందిన 77 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ. 53 లక్షలు కొల్లగొట్టారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.

గత నెల 18న బాధితుడికి ఒక గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను ఢిల్లీ డీసీపీ రాజీవ్ కుమార్‌ను అని పరిచయం చేసుకున్నాడు. బాధితుడిపై మనీలాండరింగ్ కేసు నమోదైందని, అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిందని నమ్మబలికాడు. వెంటనే బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తామని బెదిరించాడు. తన మాటలను బాధితుడు నమ్మేలా చేయడానికి, బ్యాంకు ఖాతాలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లుగా ఒక నకిలీ ఆర్డర్ కాపీని వీడియో కాల్‌లో చూపించాడు.

దీంతో తీవ్ర ఆందోళనకు గురైన వృద్ధుడు, తనపై కేసు నమోదు చేయవద్దని వారిని వేడుకున్నాడు. ఇదే అదనుగా భావించిన నేరగాళ్లు, కేసు నుంచి బయటపడాలంటే తమకు సహకరించాలని సూచించారు. ఖాతాలోని డబ్బును తాము చెప్పిన అకౌంట్‌కు బదిలీ చేస్తే వాటిని పరిశీలించి తిరిగి జమ చేస్తామని మాయమాటలు చెప్పారు.

వారి మాటలు నమ్మిన బాధితుడు విడతలవారీగా రూ. 53 లక్షలను వారు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశాడు. డబ్బులు అందిన వెంటనే సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. ఎంత ప్రయత్నించినా వారి నుంచి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *