కేంద్ర మంత్రి, కరీంనగర్ బీజేపీ లోక్ సభ సభ్యుడు బండి సంజయ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని 20 వేల మంది పదో తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.
ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. తన పుట్టినరోజు జులై 11కు ముందే, 8 లేదా 9 తేదీలలో సైకిళ్ల పంపిణీని ప్రారంభించనున్నట్లు బండి సంజయ్ తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు ప్రధాని మోదీ కానుకగా ఈ సైకిళ్లను ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.
జిల్లాల వారీగా సైకిళ్ల పంపిణీ వివరాలను ఎక్స్‌లో ఆయన వెల్లడించారు. అన్ని మండలాల్లో వంద చొప్పున, మున్సిపల్ డివిజన్ల పరిధిలో 50 చొప్పున, గ్రామ పంచాయతీల్లో పది నుంచి 25 సైకిళ్లను పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఒక్కో సైకిల్ ధర రూ.4 వేలు కాగా, ఇప్పటికే 5 వేల సైకిళ్లు వచ్చాయని, వీటిపై ప్రధాని మోదీ ఫోటో ఉంటుందని ఆయన తెలిపారు.