వాహనదారులకు షాక్.. 19 నెలల్లో 18,973 లైసెన్సుల సస్పెన్షన్

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా గత 19 నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 18,973 డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేసినట్టు రవాణా శాఖ స్పష్టం చేసింది. మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం వంటి తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన వారి లైసెన్సులను రద్దు చేసినట్లు శుక్రవారం విడుదల చేసిన తమ ప్రగతి నివేదికలో పేర్కొంది. ఈ గణాంకాలు 2023 డిసెంబర్ నుంచి 2025 జూన్ వరకు నమోదైనవి.

మరోవైపు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీ) ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీ రాయితీలు కల్పిస్తోంది. ఈవీ పాలసీ కింద రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులో 100 శాతం మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. 2024 నవంబర్ 16 నుంచి 2025 జూన్ 30 మధ్య కాలంలో 49,633 ఈవీలకు గాను రూ.369.27 కోట్ల మేర పన్నులు మినహాయించినట్లు నివేదికలో వివరించింది.

అలాగే, రవాణా శాఖలో మరిన్ని సంస్కరణలు తీసుకురానున్నట్లు తెలిపింది. డ్రైవింగ్ నైపుణ్యాన్ని కచ్చితంగా పరీక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 25 ద్విచక్ర, 27 ఫోర్-వీలర్, 5 భారీ వాహనాల టెస్టింగ్ ట్రాక్‌లను ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లుగా మార్చనున్నారు. ఆగస్టు చివరి నాటికి ‘వాహన్’ అప్లికేషన్ ద్వారా డిజిటల్ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొంది.

ఇక, రాష్ట్ర వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్‌ను ‘టీఎస్’ నుంచి ‘టీజీ’గా మార్చిన విషయం తెలిసిందే. 2024 మార్చి 15న ఈ మార్పు అమల్లోకి రాగా, జూన్ 30 నాటికి రాష్ట్రంలో 13.05 లక్షల వాహనాలు ‘టీజీ’ కోడ్‌తో రిజిస్టర్ అయ్యాయని రవాణా శాఖ తన నివేదికలో వెల్లడించింది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *