గన్నవరం సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులో భారీ చోరీ.. రూ.13 లక్షల స్టాంపు పేపర్లు మాయం

V. Sai Krishna Reddy
1 Min Read

గన్నవరం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ దొంగతనం జరగడం స్థానికంగా కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు ఏకంగా రూ.13.56 లక్షల విలువైన నాన్-జ్యుడీషియల్ స్టాంపు పేపర్లను అపహరించుకుపోయారు. అధికారులు ఈ ఘటనపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, చోరీకి గురైన స్టాంపు పేపర్లను ఎవరూ కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు.

వివరాల్లోకి వెళితే… బుధవారం విధులు ముగిసిన తర్వాత సిబ్బంది కార్యాలయానికి తాళాలు వేసి వెళ్లారు. గురువారం ఉదయం కార్యాలయం తెరిచేందుకు రాగా, ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లి చూడగా బయటి గదిలోని బీరువాను పగలగొట్టి అందులో ఉన్న స్టాంపు పేపర్ల బండిళ్లను దుండగులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దొంగలు చాలా పక్కా ప్రణాళికతో ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. వేలిముద్రలు దొరకకుండా గ్లోవ్స్ ధరించి, పని పూర్తియ్యాక వాటిని అక్కడే పడేసి వెళ్లారు.

ఈ ఘటనపై జిల్లా రిజిస్ట్రార్ గోపాలకృష్ణమూర్తి స్పందించారు. చోరీకి గురైన స్టాంపు పేపర్ల మొత్తం విలువ రూ.13,56,300 అని ఆయన నిర్ధారించారు. దొంగతనానికి గురైన సిరీస్ నంబర్లున్న స్టాంపు పేపర్లను ప్రజలు ఎవరూ కొనవద్దని, వాటితో లావాదేవీలు జరపవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ నంబర్ల స్టాంపులు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు గానీ, సమీపంలోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి గానీ సమాచారం అందించాలని కోరారు.

చోరీకి గురైన స్టాంపు పేపర్ల వివరాలు:
రూ.50 స్టాంపులు: కోడ్ నంబర్లు – బీఏ748201 నుంచి బీఏ751000 వరకు, బీఏ751201 నుంచి బీఏ752000 వరకు.
రూ.100 స్టాంపులు: కోడ్ నంబర్లు – డీఈ815701 నుంచి డీఈ816000 వరకు, డీడీ827401 నుంచి డీడీ828000 వరకు.

సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీం సహాయంతో సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి, దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రభుత్వ కార్యాలయంలోనే ఇంత పెద్ద మొత్తంలో స్టాంపు పేపర్లు చోరీకి గురవ్వడం అధికారులను విస్మయానికి గురిచేసింది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *