పన్ను ఎగవేతదారులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. బెంగుళూరు నగరంలో రోడ్డు పన్ను చెల్లించకుండా తిరుగుతున్న ఓ ఖరీదైన ఫెరారీ కారు యజమానికి అధికారులు భారీ షాక్ ఇచ్చారు. ఏకంగా రూ. 1.42 కోట్లను జరిమానాగా వసూలు చేసి రికార్డు సృష్టించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే… రూ. 7.5 కోట్ల విలువైన ఎరుపు రంగు ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడాలే కారు గత కొద్ది నెలలుగా బెంగుళూరు రోడ్లపై చక్కర్లు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే, ఈ కారుకు కర్ణాటకలో రోడ్డు పన్ను చెల్లించలేదని అధికారులకు సమాచారం అందింది. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఈ వాహనాన్ని గురువారం ఉదయం బెంగుళూరు సౌత్ ఆర్టీఓ అధికారులు గుర్తించి, పన్ను వివరాలను ధ్రువీకరించుకున్నారు.
పన్ను చెల్లించలేదని నిర్ధారించుకున్న వెంటనే వాహనాన్ని సీజ్ చేసి, యజమానికి నోటీసులు జారీ చేశారు. గురువారం సాయంత్రంలోగా మొత్తం బకాయిలు చెల్లించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో వెంటనే స్పందించిన యజమాని, జరిమానాతో సహా మొత్తం రూ. 1,41,59,041 చెల్లించి కారును విడిపించుకున్నారు.
ఇటీవలి కాలంలో ఒకే వాహనం నుంచి ఇంత భారీ మొత్తంలో పన్ను వసూలు చేయడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. నగరంలో పన్ను చెల్లించని ఇతర లగ్జరీ కార్లపై కూడా దాడులు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. కాగా, గత ఫిబ్రవరిలో కూడా రవాణా శాఖ అధికారులు ఫెరారీ, పోర్షే, బీఎండబ్ల్యూ వంటి 30 లగ్జరీ కార్లను పన్ను ఎగవేత కారణంగా సీజ్ చేసిన విషయం తెలిసిందే.