కృష్ణా నది ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. జలాశయంలో నీటి మట్టం గంటగంటకూ పెరుగుతోంది. జూరాల నుంచి 1,00,085 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది.
ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం (నేటి ఉదయానికి) 874.30 అడుగులకు చేరింది. మరో 12 అడుగుల మేర నీరు చేరితే ప్రాజెక్టు నిండుకుండలా మారుతుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను 160.52 టీఎంసీలకు నీరు చేరింది.
ఈ క్రమంలో ప్రాజెక్టు కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు ప్రారంభించారు. విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 58,750 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.