వీధికుక్కల దాడితో చిన్నారి గాయపాటు
• తల్లిపైనా కుక్కలు దాడికి యత్నం
రాజంపేట జూన్ 19 (ప్రజా జ్యోతి)
రాజంపేట మండల కేంద్రంలో వీధికుక్కల దాడి చిన్నారి ప్రాణాలను బెట్టే స్థాయికి చేరింది. గడ్డమిడి నిధ్విత్ నాని (6) అనే చిన్నారి ట్యూషన్‌కు వెళ్లేందుకు సాయంత్రం ఇంటి బయటకు వచ్చిన సమయంలో గుంపుగా వచ్చిన వీధికుక్కలు అతనిపై దాడి చేశాయి. ఒక కుక్క చిన్నారి ముడ్డిని కరచి తీవ్రంగా గాయపరిచింది. ఈ దృశ్యాన్ని గమనించిన తల్లి సంతోష అక్కడికి పరుగెత్తి కుక్కలను తరుమే ప్రయత్నం చేసింది. అయితే కుక్కలు ఆమెపైనా దాడి చేయబోయాయి. ఆ సమయంలో అటుగా వెళ్లిన ఓ వ్యక్తి ధైర్యంగా స్పందించి కట్టలతో కుక్కలను తరిమాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడు చికిత్సలో ఉన్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామంలో వీధికుక్కల పెరిగిన ఉనికి పట్ల ప్రజల్లో భయం నెలకొంది. చిన్నారులు, వృద్ధులు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారని వారు చెబుతున్నారు. ఇటువంటి దారుణ సంఘటనలు పునరావృతం కాకుండా వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని గ్రామపంచాయతీ అధికారులను స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కుక్కల వేట, నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.