కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఆకస్మిక తనిఖీలు:
పశువుల అక్రమ రవాణా నివారణ, పోలీస్ స్టేషన్ల పనితీరుపై పరిశీలన
కరీంనగర్ బ్యూరో, జూన్ 03, (ప్రజాజ్యోతి)
కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం సోమవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పశువుల అక్రమ రవాణా నివారణకు కమాన్పూర్ వడ్డేపల్లి, మొక్దుంపూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను ఆయన తనిఖీ చేశారు.
చెక్ పోస్టుల వద్ద తనిఖీలు:
చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని పోలీస్ కమీషనర్ ఆరాతీశారు. వారు చేస్తున్న తనిఖీల తీరును పరిశీలించి, తనిఖీలకు సంబంధించిన వాహన వివరాల నమోదు మరియు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా చెక్ పోస్టు విధుల్లో ఉన్న సిబ్బందికి వాహన తనిఖీల గురించి బ్రీఫింగ్ ఇచ్చారు. రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత రక్షణ పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. బారికేడింగ్‌ను సరైన క్రమ పద్ధతిలో అమర్చుకోవాలని తెలిపారు. అలాగే, రేడియం రిఫ్లెక్టింగ్ జాకెట్లు ధరించాలని, టార్చ్ లైట్, ఎల్.ఈ.డి. బ్యాటన్ వంటి పరికరాలను రాత్రి సమయాలలో తప్పనిసరిగా వాడాలని ఆదేశించారు. ప్రతి భారీ మరియు అతి భారీ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని స్పష్టం చేశారు.
పోలీస్ స్టేషన్ల తనిఖీలు:
చెక్ పోస్టుల తనిఖీల అనంతరం, పట్టణంలోని కరీంనగర్ ఒకటవ, రెండవ మరియు మూడవ పోలీస్ స్టేషన్లను సైతం కమీషనర్ గౌస్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లలో హాజరులో ఉన్న సిబ్బందిని ఆరాతీశారు. డయల్ 100 ద్వారా అందిన ఫిర్యాదులు, వాటి నమోదు తీరు, మరియు సిబ్బంది స్పందించిన తీరుపట్ల ఆరా తీశారు. వివిధ నేరాల్లో పట్టుబడి, పోలీస్ స్టేషన్ల ఆవరణలో ఉన్న వాహనాలపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయాల్లో పోలీస్ స్టేషన్లలో విధుల్లో ఉండే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.