పిడికిలి మాయం – ఉద్యమ ఆత్మకు గాయమా?
– తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మరచిన సింగరేణి అధికారులు
– ఉద్యమ చిహ్నాన్ని తుడిచేసిన వేడుకలు
“ఉద్యమాల వల్ల వచ్చిన స్వరాష్ట్రనీకీ గుర్తుగా నిలిచే చిహ్నాలు రాష్ట్ర పౌరులకు త్యాగధనుల ప్రతీకగా నిలుస్తాయి. అవి కేవలం శిల్పాలు మాత్రమే కాదు, ప్రాణాత్యాగాలకు గుర్తు. అలాంటి ఎంతో ప్రాధాన్యం ప్రాముఖ్యత కలిగిన విగ్రహ చిహ్నాలను మార్చడం ఉద్యమస్ఫూర్తి వెనక ఉన్న ఆత్మను మంటగలిపి నట్లే అవుతుంది.”
రామగిరి, జూన్ 02 (ప్రజాజ్యోతి) :
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని రామగుండం ఏరియా-3 లో సెంటినరీ కాలనీ రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అధికారిక వేడుకలు, తెలంగాణ స్వరాష్ట్ర సహకారానికి మూల స్తంభమైన ఉద్యమ త్యాగాలను విస్మరించి గోరతప్పిదానికి అధికార వర్గాలు పాల్పడ్డాయి. తెలంగాణ ఉద్యమ పునాదులను విస్మరించేలా, వేడుకల్లో ప్రదర్శించిన “తెలంగాణ తల్లి విగ్రహ రూపం” చిహ్నాలను మార్చి సింగరేణి అధికారులు విఫలమయ్యారని ప్రజా వర్గాలు మండిపడుతున్నాయి.
ఉద్యమ చిహ్నమైన పిడికిలి ముద్ర లేదని ఆరోపణ:
ఉద్యమ చరిత్రకు కీలకమైన సూచికగా నిలిచే మూసివేసిన ముష్టులు (పిడికిలి) – ప్రజల పోరాట శక్తి, తెలంగాణ ఆత్మగౌరవానికి సంకేతంగా భావించబడతాయి. 2024 డిసెంబర్ 9న రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో ఆవిష్కరించిన నూతన విగ్రహంలో ఈ పిడికిలి వేదిక ముఖ్య భాగంగా రూపొందించబడింది. కానీ నిన్న అనగా జూన్ 2,2025న ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి, సింగరేణి సంస్థలో నీ ఆర్జీ-3 యాజమాన్యం నిర్వహించిన వేడుకల వేదికలో ఈ పాయింట్ పూర్తిగా విస్మరించబడింది. ఉద్యమ పోరాట చిహ్నాన్ని లేకుండా చేసి తెలంగాణ తల్లి చిత్రాన్ని రూపొందించడం ఉద్యమ త్యాగాలపై అవమానం కాదా? అన్న విమర్శలు ఊపందుకున్నాయి.
1200 మంది ప్రాణత్యాగాలకు అవమానం? :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 1200 మంది ఉద్యమకారులు ప్రాణత్యాగాలు చేశారు. వారి త్యాగాలను గుర్తుచేసే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహానికి కొత్త రూపం ఇవ్వబడింది. పిడికిలి చిహ్నం వారి ఉద్యమ స్పూర్తికి స్థిరంగా నిలిచే ప్రతీకగా మారింది. అయితే, ఈ చిహ్నాన్ని తప్పించడం తెలంగాణ ఉద్యమ చరిత్రను తుంగలో తొక్కే చర్యగా పరిగణిస్తున్నారు.
అత్యుత్సాహం – అవగాహన లోపం?” :
సింగరేణి అధికారుల ఈ చర్యపై ఉద్యోగ సంఘాలు, ప్రజా సంస్థలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. “ఉత్సవాల సందర్భంగా ఉద్యమానికి ఆధారంగా నిలిచిన విగ్రహ రూపాన్ని అర్ధరహితంగా మార్చడం అత్యుత్సాహపు చర్య కంటే అవగాహన లోపానికి ఉదాహరణ” అని ఉద్యమకారులు మండిపడుతున్నారు. “సంస్థను నిర్మించిన కార్మికులు ఇప్పుడు అధికారుల దుశ్చర్యతో తలవంచుకునే పరిస్థితి,” అని మాజీ కార్మిక సంఘ నాయకుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం స్పందించాలన్న డిమాండ్ :
ఈ ఘటనపై ప్రభుత్వ స్థాయిలో విచారణ జరిపి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని, తద్వారా ఉద్యమ విలువల్ని పరిరక్షించాలని ఉద్యోగ, కార్మిక, సంఘాలు, ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయి ఉండి తెలంగాణ తల్లి విగ్రహ చిహ్నాలను మార్చడం రాష్ట్ర ప్రశాసనాధికారనికి భంగం కలిగించినట్లు,
తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర ప్రజల పోరాట స్ఫూర్తి, ఉద్యమ త్యాగాల గుర్తు, మరియు సాంస్కృతిక ఐక్యతకు ప్రతీక. దీని రూపాన్ని మార్చడం అంటే కేవలం శిల్పాన్ని మార్చడం కాదు – అది ఒక తరం చరిత్రను తిరగరాయడమే అవుతుంది. ఏది ఏమైనా ఈ ఘోర తప్పిదానికి పాల్పడిన సంబంధిత అధికారులపై విచరణ జరిపి, చర్యలు తీసుకోవాలని ప్రజల నుండి వస్తున్న డిమాండ్.., మరి చూడాలీ సింగరేణి యాజమాన్యం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో, వదిలేస్తుందో వేచి చూడాలంటున్నారు పలువురు విద్యావంతులు…