నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో పడి ముగ్గురు యువకులు గల్లంతు
ఎల్లారెడ్డి, జూన్ 2, ( ప్రజా జ్యోతి)
ఎల్లారెడ్డి మండలం సోమార్ పేట్ గ్రామ శివారులోని నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతైనట్లు గ్రామస్తులు సోమవారం రాత్రి తెలిపారు. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి, సోమార్పేట్ గ్రామ శివారులోని పిప్పిర్యాగడి తాండా సమీపం వద్ద నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో 11 మంది యువకులు సరదాగా ఈత కొట్టడానికి వెళ్ళారు. వీరిలో ముగ్గురు చాలా లోపలికి వెళ్ళడంతో ఒడ్డుకు చేరుకోలేక పోయారు. మిగతా యువకులు ఒడ్డుకు చేరుకుని తల్లి తండ్రులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి మాజీ వైస్ ఎంపిపి నునుగొండ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, నాయకులు మంచిర్యాల విద్యాసాగర్ లు ఫైర్ రెస్క్యూ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించి, వారితోపాటు గ్రామస్తులతో కలిసి బ్యాక్ వాటర్ వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చీకటి కావడంతో సహాయక చర్యలు ఆపివేశారు. ఉదయం సహాయక చర్యలు చేపట్టనున్న రెస్క్యూ టీమ్ తెలిపారు. మిగితా యువకులను వారి తల్లితండ్రులకు అప్పగించారు. గల్లంతైన వారిలో ఎల్లారెడ్డి, కళ్యాణి , సోమర్ పేట్ గ్రామాలకు చెందిన మధుకర్ గౌడ్ (17), నవీన్ (23), హర్షవర్ధన్ (17)లు ముగ్గురు ఉన్నారు. వీరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. పిల్లల గల్లంతుతో తల్లి తండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.