ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన కీలక సభ్యుడు, షార్ప్‌షూటర్‌గా పేరొందిన నవీన్‌కుమార్ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇతనిపై హత్యలు, దోపిడీలు సహా 20కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో నేరగాళ్ల ఏరివేత కార్యక్రమాన్ని పోలీసులు ముమ్మరం చేసిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (యూపీఎస్టీఎఫ్), ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా హాపుర్ ప్రాంతంలో ఒక ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ జరుగుతుండగా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన నవీన్‌కుమార్ అక్కడికి చేరుకున్నాడు. పోలీసులను గమనించిన వెంటనే వారిపై కాల్పులు జరుపుతూ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోవడానికి విఫలయత్నం చేశాడు.
ఈ క్రమంలో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపగా, కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. తక్షణమే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని అధికారులు తెలిపారు.
మృతిచెందిన నవీన్‌కుమార్ ఘజియాబాద్ జిల్లాలోని ‘లోని’ ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఇతను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో షార్ప్‌షూటర్‌గా చురుగ్గా వ్యవహరిస్తున్నాడని, గ్యాంగ్‌లోని మరో సభ్యుడు హషీం బాబాతో కలిసి పలు నేరాలకు పాల్పడ్డాడు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, దోపిడీ వంటి సుమారు 20కి పైగా కేసుల్లో నవీన్‌కుమార్ నిందితుడిగా ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా పలు తీవ్రమైన నేరాలకు పాల్పడుతూ వార్తల్లో నిలుస్తోంది. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు ఈ గ్యాంగ్ నుంచి అనేకసార్లు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే సల్మాన్ ఖాన్ స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య వెనుక కూడా ఇదే గ్యాంగ్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ గ్యాంగ్ నాయకుడు లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం జైల్లో ఉన్నప్పటికీ, అక్కడి నుంచే తన అనుచరులతో మొబైల్ ఫోన్ల ద్వారా టచ్‌లో ఉంటూ నేరాలకు, హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.