విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయురాలు ఏడాది కాలంగా విధులకు హాజరు కాకుండానే ప్రతినెలా పూర్తి జీతం తీసుకున్న ఘటన నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమాలకు సహకరించిన ప్రధానోపాధ్యాయుడు, మండల మాజీ విద్యాశాఖాధికారి (ఎంఈవో)పైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
వివరాల్లోకి వెళితే.. చందంపేట మండలం కొర్రతండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న పర్వీన్ సుల్తానా గత ఏడాది జులైలో గాగిలాపురం పాఠశాలకు డిప్యుటేషన్‌పై వెళ్లారు. అప్పటి నుంచి ఆమె విధులకు సరిగా హాజరు కాలేదు. అప్పుడప్పుడు దేవరకొండకు వచ్చిన సమయంలో ప్రధానోపాధ్యాయుడు వేణుమాధవ్, హాజరు పట్టికలో ఆమెతో సంతకాలు చేయించుకున్నట్టు ఆరోపణలున్నాయి.
ఇలా ఏడాది కాలంగా పర్వీన్ సుల్తానా విధులకు గైర్హాజరవుతూ ప్రభుత్వ జీతం పొందుతున్నారని, ప్రధానోపాధ్యాయుడు వేణుమాధవ్, ఇన్ఛార్జ్ మాజీ ఎంఈవో సామ్యా నాయక్ కూడా ఈ అక్రమంలో భాగస్వాములయ్యారని తెలిసింది. సుల్తానాకు వచ్చిన జీతంలో కొంత భాగాన్ని వేణుమాధవ్, సామ్యా నాయక్ పంచుకున్నట్టు ఆరోపణలున్నాయి.
ఈ “బడి దొంగల” వ్యవహారంపై ఉపాధ్యాయ సంఘాలు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) భిక్షపతికి ఫిర్యాదు చేశాయి. అయితే, ఆయన తొలుత ఈ ఫిర్యాదును పెద్దగా పట్టించుకోకుండా వారిని వెనకేసుకొచ్చారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయి. దీంతో యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల నేతలు డీఈవో తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఆయన కార్యాలయాన్ని ముట్టడించేందుకు సిద్ధమయ్యారు. విషయం తీవ్రతను గమనించిన డీఈవో, ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చలు జరిపి రాజీ కుదుర్చుకున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయురాలు పర్వీన్ సుల్తానాతో పాటు, ఆమె అక్రమాలకు సహకరించిన ప్రధానోపాధ్యాయుడు వేణుమాధవ్, ఇన్ఛార్జ్ మాజీ ఎంఈవోగా వ్యవహరించిన సామ్యా నాయక్‌ను కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే ఇలా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే, ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను ఎలా పంపించాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.