
బహిరంగ వేలం ప్రకటన ఇవ్వక పోవడం వెనుక మతలబు ఏంటి..!!
◆ సర్వే నెం 504/అ1 మాత్రమే దేవాదయ భూమి.
◆ సర్వే నం. 504/అ తో మాకు సంబంధం లేదు.
◆ దేవాదయ భూమి పై కోర్టు కేసులున్నాయి.
◆ భజన సంఘాలకు, భక్తి సంఘాలకు భూమి పై హక్కులు లేవు.
◆ దేవాదయ భూమి తరపున కేసులేసే అర్హత వారికి లేదు.
◆ శ్రీకృష్ణ ఆలయానికి అనుమతి ఇవ్వలేదు.
◆ ప్రైవేట్ భూమితో హద్దులకు సర్వేకు పంపాం.
◆ అబద్దాలు ప్రచారం చేసే సూడో సంఘాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
◆ భక్తాంజనేయ దేవాదయ భూమి గుట్టు విప్పిన అసిస్టెంట్ కమిషనర్.
ఖమ్మం, 9 ఆగస్ట్, ప్రజాజ్యోతి.
నగరంలో హాట్ కేకులా ఉన్న భక్తాంజనేయ స్వామికి చెందిన భూమిగా వివాదంలో ఉన్న భూమి గురించి ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సులోచన నోరు విప్పారు. ఈ స్థలం పై జరుగుతున్న పలు వివాదాస్పద అంశాల పై అసిస్టెంట్ కమిషనర్ పలు ఆసక్తికర ఆంశాలు తెలిపారు.
◆ వేలం పాటతో.. పాట్లు..!!
గత నెల 24న దేవాదయ శాఖ ఆ భూమికి వేలం వేసి లక్షన్నర ఆదాయం వచ్చినట్టు ప్రకటించింది. కాగా ఇదే భూమి పై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్టుగా దేవాదయ అధికారులు గతంలో ప్రకటించిన నేపద్యంలో ఈ అప్రకటిత వేలం ఎలా సాధ్యమైంది. ఈ విషయంలో అసిస్టెంట్ కమిషనర్ క్లారిటీ ఇచ్చారు. ఖమ్మం నగరంలో టేకులపల్లి గ్రామంలో గల భక్తాంజనేయ స్వామి ఆలయానికి పూజా కైంకర్యాలకు ఆ భూమిని బహుమతి ఇచ్చినట్టుగా తమకు సమాచారం ఉందన్నారు. కాగా ఈ భూమి పై ఇప్పటికే కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఆ భూమి సుమారు 1966లో మూడెకరాల పది కుంటల స్థలాన్ని దానమిచ్చినట్టు రికార్డుల్లో ఉన్నప్పటికీ, నాటికీ నేటికీ విస్తీర్ణంలో తేడా వచ్చిన మాట వాస్తవమేనన్నారు. 'రోడ్డు పక్కన భూమి కావడం చేత, రోడ్డు విస్తీర్ణంలో కొంత పోయిందని, ప్రభుత్వం ప్రజలకోసం ఏర్పాటు చేసిన మౌళిక సదుపాయాలకు సేకరించిన భూమితో బాటు సరిహద్దుల సమస్య వల్ల పూర్తి విస్తీర్ణం ఇప్పుడు అందుబాటులో లేదన్నారు.
ఆ భూమి మాత్రమే దేవాదయ భూమి వెలుమట్ల రెవిన్యూ పరిధిలో గల సర్వే నం. 504/అ1 మాత్రమే దేవాదయ శాఖకు చెందిన భూమి' అని అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. దానికి అదే సర్వే నంబర్‌లో సరిహద్దుల్లో గల భూమితో సరిహద్దులు నిర్ణయించేందుకు మా డిపార్ట్‌మెంట్ సర్వే కోసం దరఖాస్తు చేశామని, త్వరలో సర్వే జరిపి డిపార్ట్‌మెంట్ వారు హద్దులు నిర్ణయిస్తారని తెలిపారు. దేవాదయ శాఖ భూమి సరిహద్దుల్లో అదే సర్వే నంబర్‌లో ఇతర ప్రైవేట్ భూములు ఉన్నాయని, వాటితో దేవాదయ శాఖకు సంబంధం లేదని వివరించారు.
◆ కృష్ణుడి ఆలయానికి అనుమతి ఇవ్వలేదు.
దేవాదయ శాఖ భూమిలో శ్రీ కృష్ణుడి ఆలయం నిర్మించేందుకు అనుమతి ఇవ్వమని ఓ భక్త సంఘం చేసుకున్న దరఖాస్తును తిరస్కరించామన్నారు. ఏ సంఘాలకు ఈ భూమి పై ప్రైవేట్‌గా కార్యకలాపాలు, లావాదేవీలు, కోర్టు కేసులు వేసే అర్హత లేదన్నారు. ఒక వేళ అత్యుత్సాహంతో వేసినప్పటికీ అవి చెల్లవని తేల్చి చెప్పారు. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరైనా ఈ భూమితో తమకు సంబంధం ఉందని చెప్పినా, అక్కడ ప్రైవేట్ దైవ కార్యక్రమాలు నిర్వహిస్తామని వసూళ్లకు పాల్పడ్డా ప్రజలు తమకు తెలియజేయాలని, అక్రమార్కుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
◆ ఆ వేలానికి అడ్వకేట్‌కు, ఆ సంఘానికి సంబంధం లేదు.
గత నెల 24న దేవాదయ శాఖకు చెందిన భూమికి జరిగిన వేలంపాటలో ఓ దిన పత్రికలో ఒక న్యాయవాది ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించినట్టు ప్రచురించారని, ఆ ప్రకటన తాము ఇచ్చింది కాదని తెలిపారు. ఆ భూమికి , ఆ ఆడ్వకేట్‌కి, ఆయన వకాలతా పుచ్చుకుంటున్న భక్త సంఘానికి, భజన సంఘానికి దేవాదయ భూమికి సంబంధం లేదని తెలిపారు. స్వామి కార్యం కంటే స్వకార్యం కోసమే అసంబద్ద విషయాలను ప్రచారం చేసే వారిని నమ్మవద్దన్నారు.
◆ వివాదం పట్టాదారులకు దేవాదయ శాఖకు మాత్రమే.
దేవాదయ శాఖ భూమికి సంబంధించిన వివాదం కేవలం దేవాదయ శాఖకు, ఆ భూమిని దానం చేసిన వారి వారసులకు మాత్రమే నని, మధ్యలో భజన సంఘాలు, భక్త సంఘాలు, మిద్యా సంఘాలు, మిడిసి పడే సంఘాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా అటువంటి ప్రయత్నం చేస్తే తమ దృష్టికి తేవలసిందిగా సూచించారు. త్వరలో తాము కూడా ఒక ప్రకటన వెలువరుస్తామని తెలిపారు.
◆ ఆ షాపుల వారికి నోటీసులు జారీ చేస్తాం.
దేవాదాయ శాఖ భూమి ఖాళీగా ఉండటంతో కొందరు పొట్ట కూటి కోసం అక్కడ రోడ్డు పై చిన్న చిన్న దుకాణాలు పెట్టుకున్నారని, వారు వాటిని స్థిర పరిచి, అనధికార వ్యక్తులకు కిరాయి చెల్లిస్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చిందని, దుకాణాలు మా పరిధిలో ఉంటే వారికి నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమని తెలియజేస్తామని, లేని పక్షంలో దేవాదాయ శాఖకు అద్దె చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
◆ సూడో సంఘాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
తాము దేవుడి కోసమే పని చేస్తున్నామని, దేవుడి సేవలో తరిస్తున్నామని, దేవుడి మాన్యాన్ని ఉద్దరిస్తున్నామని అబద్దాలు వల్లిస్తూ, అక్రమంగా వసూలు చేస్తూ పబ్బంగడుపుకునే కుహనా సంఘాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ హెచ్చరించారు. గతంలో కూడా ఆ స్థలంలో ఆలయం నిర్మిస్తామని, విగ్రహ ప్రతిష్ట చేస్తామని, అమాయక భక్తుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని, వెంటనే ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నామని తెలిపారు. ఇదే ప్రయత్నం కోసం దేవుడి పై భక్తి ఉన్నవారు వారికి లక్షల్లో చందా ఇచ్చినట్టు మాకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో వారి పై చర్యలు తీసుకోలేదన్నారు. భవిష్యత్‌లో ఎలాంటి గుర్తింపులేని, ఎలాంటి రికార్డులు లేని అనధికార బోగస్ సంఘాల పట్ల ప్రజలు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఆయాచితంగా లబ్దిపొందాలనే ప్రయత్నం చేస్తే తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా సూచించారు. కోర్టులో వున్న వివాదాలు పరిష్కారం అయ్యాక, సర్వే తర్వాత హద్దులు నిర్ణయించి కట్టుదిట్టం చేస్తామన్నారు. దేవాదాయశాఖ ఉద్యోగులు తప్ప ఇంకెవరైనా ఈ విషయంలో తలదూరిస్తే వారి పై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
అయితే కొన్ని ప్రశ్నలకు మాత్రం భక్తులకు, ప్రజలకు సమాధానాలు ఎప్పుడు దొరుకుతాయో వేచి చూడాలి. అసలు ఆ భూమి దేవాదాయ శాఖ దేనా..??
ఇన్నాళ్లూ కళ్లు మూసుకున్నారా..??
భక్త సంఘాల పేరుతో చేసే ఆరాచకాల పై ఎందుకు మౌనంగా ఉంటున్నారు..??
అసులు ఆ డాక్యుమెంట్లలో ఏముంది..??
బహిరంగ వేలం ప్రకటన ఇవ్వక పోవడం వెనుక మతలబు ఏంటి..??
ఆ ఆడ్వకేట్ ప్రమేయం ఏంటి..??
- 17 views