'సతీష్ ధావన్' భారత ఆత్మ..!!

Submitted by Praneeth Kumar on Wed, 23/08/2023 - 22:08
'Satish Dhawan' is the soul of India..!!

'సతీష్ ధావన్' భారత ఆత్మ..!! 

ఖమ్మం, ఆగస్ట్ 23, ప్రజాజ్యోతి.

సతీష్ ధావన్ పేరు తెలియకుండా భారతదేశంలో బతకటం తప్పు కాదు. కానీ, సతీష్ ధావన్ ఎవరో తెలియకుండా భారతీయుడిగా చావటం నేరం. ప్రస్తుత చంద్రయాన్-3 ని మన శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచే పంపించారు.
సతీష్ ధావన్ భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) చైర్మన్ గా ఉండి ప్రయోగాలు నిర్వర్తిస్తున్నప్పుడు భారత దేశానికి అంతరిక్ష పరిక్షలు అవసరమా అని ప్రపంచం ఎగతాళి చేసింది. సతీష్ ధావన్ ఇస్రో చైర్మన్ గా ఉన్నప్పుడు భారత తొలి ఉపగ్రహ వాహక నౌక ఎస్ఎల్వి (శాటిలైట్ లాంచింగ్ వెహికల్) అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దానికి అబ్దుల్ కలాంను నాయకుడిగా నియమించాడు ధావన్.
మొదటి ప్రయోగం విఫలమైనప్పుడు ప్రపంచం అంతా నవ్వింది. దీనికి తోడు స్వదేశీ మీడియా వచ్చి కోటానుకోట్ల డబ్బు నాశనం చేసిన అబ్దుల్ కలాం ఎవరో బయటికి రావాలి అని నినాదాలు చేస్తుంటే కలాం మీడియాతో మాట్లాడటానికి రెడీ అవుతుంటే సతీష్ ధావన్ బయటికి వచ్చి నా టీమ్ మీద నమ్మకం ఉంది. విఫలమవటానికి ఇస్రో చైర్మన్ గా నేను కారణం అని బయటి ప్రపంచానికి చెప్పాడు. అబ్దుల్ కలాం, టీమ్ తాము చేసిన తప్పుకి మా నాయకుడు ధావన్ శిక్ష అనుభవించాడు అని చెప్పి రెట్టింపు కసి, పట్టుదలతో పని చేసి రెండవసారి విజయం సాధించారు. భారత తొలి ఉపగ్రహ నౌక పరీక్ష విజయవంతమైంది అని ప్రపంచంతో పాటు స్వదేశీ మీడియా అంతా వచ్చి సతీష్ ధావన్ ని మాట్లాడవలసినదిగా కోరారు. అప్పుడు సతీష్ ధావన్, అబ్దుల్ కలాంని పిలిచి మీడియాతో మాట్లాడమని చెప్పి తాను మాత్రం ఆ సమయంలో చేస్తున్న ప్రయోగాలతో మునిగిపోయాడు.
ఫెయిల్ అయినప్పుడు నాయకుడిగా తాను బాధ్యత తీసుకొని మాట్లాడటం, అదే విజయం సాధిస్తే తన టీమ్ ని మాట్లాడమని చెప్పటం, వాళ్ళకి క్రెడిట్ ఇవ్వటం అత్యంత గొప్ప నాయకత్వ లక్షణం. ఈ దేశానికి సతీష్ ధావన్ లాంటి వాళ్ళు కావాలి. ఫ్లూయిడ్ డైనమిక్స్ పితామహుడుగా ప్రపంచం గుర్తించినా నేను భారత దేశ విద్యార్ధిని అనేవాడు సతీష్ ధావన్. మన అంతరిక్ష సంస్థ ఇస్రో శీఘ్రగతిన ఎదగడానికి, భారతదేశం శాస్త్ర సాకేంతిక రంగంలో ప్రగతి సాధించటానికి ఒక కారణం సతీష్ ధావన్. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ ఇండియన్ స్పేస్ కమిషన్ లో భారత దేశపు మొట్ట మొదటి సూపర్‌ సోనిక్ విండ్ టన్నెల్‌ను నిర్మించినది కూడా సతీష్ ధావన్ నే. సతీష్ ధావన్ పరిశోధనల మూలం గానే మన ఇన్సాట్ టెలీకమ్యూనికేషన్స్ శాటిలైట్, ఐఆర్సీ ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్, పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ లు రూపొందించబడ్డాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డైరక్టర్ గా కూడా పని చేసి దాని అభివ్రుద్దికి శ్రీకారం చుట్టాడు సతీష్ ధావన్. మన దేశ అసలు సమస్య పెతోడూ నాయకత్వం కోరుకునేవాడే కానీ నాయకత్వ లక్షణాలు, బాధ్యత కలిగినవారు తక్కువ. లీడర్ షిప్ అంటే అలంకారం కాదు, బాధ్యత. ఇంకా, మన దేశంలో టాలెంట్, సబ్జెక్ట్ ఉన్నోళ్లకి నాయకత్వ లక్షణాలు ఉండవు. నాయకత్వ లక్షణాలు ఉన్నోళ్లకి సబ్జెక్ట్, టాలెంట్ ఉండదు. ప్రస్తుతం మన దేశానికి టాలెంట్, సబ్జెక్ట్ ఉండి నాయకత్వ లక్షణాలు కలిగిన సతీష్ ధావన్ లాంటి వారి అవసరం ఉంది అని మా అభిప్రాయం.
రాత్రి అంతా మెలకువగా ఉండి చంద్రయాన్-3 విక్రం ల్యాండర్  ల్యాండింగ్ కోసం ఎదురు చూసిన కాబట్టి చంద్రయాన్ సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే అది విజయవంతం తర్వాత మాట్లాడిన ఐదుగురు ఇస్రో నాయకత్వ టీం మాటల వల్ల ఇంకా సంతోషంగా ఉంది. ఇది సమిష్టి విజయం అని మనస్పూర్తిగా మాట్లాడారు. చంద్రయాన్-3 టీం సక్సెస్ మాత్రమే కాదు ఇది, చంద్రయాన్-1, చంద్రయాన్-2 ఇంకా డైరక్ట్ గా, ఇన్ డైరక్ట్ గా ఎంతో మంది కృషి ఉంది అని చెప్పటం నిజమైన సంతోషం కలిగించింది. ప్రస్తుతం మన దేశానికి సతీష్ ధావన్ లాంటి నాయకత్వ లక్షణాలు కలిగిన నాయకులు కావాలి.