రిజిస్ట్రేషన్ శాఖలో పెండింగ్ డాక్యుమెంట్ ల మాయాజాలం... చక్రం తిప్పుతున్న జిల్లా అధికారి... నాన్ లేఅవుట్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తున్న ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ లు...

Submitted by SANJEEVAIAH on Fri, 04/08/2023 - 01:44
Photo

రిజిస్ట్రేషన్ శాఖలో పెండింగ్ డాక్యుమెంట్ల మాయ

*పెండింగ్ పేరుతో వసూళ్ళు

*తీరు మార్చుకోని సబ్ రిజిస్ట్రార్లు

*ఇంచార్జీ సబ్ రిజిస్ట్రార్లతో చక్రం తిప్పుతున్న వైనం

*మళ్లీ నాన్ లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు

*ప్రభుత్వ నిబంధనలు గల్లంతు

(నిజామాబాద్ ప్రతినిధి - ప్రజాజ్యోతి - ఎడ్ల సంజీవ్)

నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ శాఖలో కాసుల పంట పండిస్తున్నారు. ఎక్కడికి అక్కడే నాన్ లేఅవుట్ ప్లాట్ లను రిజిస్ట్రేషన్లు చేస్తూ గజానికి ఒక రేటు పెట్టి మరి వసూలు చేస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. దీనికోసం రిజిస్ట్రేషన్ శాఖలో సబ్ రిజిస్టర్లు (ఇoచార్జీ) కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ మార్గమే "పెండింగ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ విధానం". ఈ విధానాన్ని అడ్డం పెట్టుకొని 100 గజాల స్థలానికి రూ.50 వేల చొప్పున లెక్కలు వేస్తూ బహిరంగంగానే వసూలు చేస్తున్నారు. ఇటీవల నిజామాబాద్ రిజిస్ట్రేషన్  శాఖలో ఓ డాక్యుమెంట్ చేసేందుకు రూ. 8 లక్షలు బహిరంగంగానే డిమాండ్ చేశారు. అంత సొమ్ము ఇచ్చుకోలేక సదరు బాధితులు వెనుకడుగు వేశారు. కానీ అదేవిధంగా దుబ్బ బైపాస్ రోడ్డు, నాల్కల్ రోడ్డు లోని నాన్ లేఔట్ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసేందుకు అక్షరాల రూ.10 లక్షలు వసూలు చేశారు. ఈ సొమ్మును ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ కింద నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు పంపిణీ చేశారు. ఇలా ప్రతివారం పంపకాలు చేయడం గమనార్హం. ఇలాగే కామారెడ్డి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇదే తంతు కొనసాగుతుంది. జిల్లా కార్యాలయంలోని ఓ కీలక అధికారి రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ లను తప్పించి సీనియర్ అసిస్టెంట్లను ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ లుగా నియమించుకొని ఈ తతంగాన్ని కొనసాగిస్తున్నారనేది బహిరంగ రహస్యం.

*పె"డింగ్ డింగ్" డాక్యుమెంట్స్....*

నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లోని సబ్ రిజిస్టార్ల కార్యాలయంలో వింత పోకడ కొనసాగుతుంది. ఇక్కడ అంతా "కంచె చేను మేస్తున్న" చందంగా వ్యవహారం జరుగుతోంది.సూత్రధారిగా వ్యవహరిస్తున్న ఆ కీలక అధికారి పెండింగ్ పేరుతో తెర వెనుక సాగిస్తున్న ఈ వసూళ్ల దందా విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండా అంతా తానై చక్కబెడుతున్నారు.   ఉదాహరణకు నిబంధనలకు విరుద్ధంగా నాన్ లే అవుట్ ప్లాట్ లను రిజిస్ట్రేషన్ చేసేందుకు  ఇదోక రకమైన పద్ధతి. ముందుగా డాక్యుమెంట్ రైటర్ తో రేటు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు వస్తుంది. అలా వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. చివరకు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఆ తర్వాత చిన్న కారణం చూపి ఆ డాక్యుమెంట్ను పెండింగ్లో పెడతారు. ఆ తర్వాత కొద్ది రోజులకు రహస్యంగా స్కానింగ్ చేసి రెగ్యులర్ డాక్యుమెంట్ నెంబర్ వేసి డాక్యుమెంట్ రైటర్లకు అప్పగిస్తారు. ఇలా బయటకు ఆ డాక్యుమెంట్ చేయలేదని ప్రచారం ఉంటుంది. కానీ కొద్ది రోజుల్లోనే రెగ్యులర్ డాక్యుమెంట్ నంబర్తో రహస్యంగా డాక్యుమెంట్ బయటకు వెళ్తుంది. ఇది ఇప్పుడు జరుగుతున్న కొత్త తరహా తతంగం.

*కంచె చేను మేస్తే...*
  
నిజామాబాద్ రిజిస్ట్రేషన్ శాఖలో నాన్ లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల రిజిస్ట్రేషన్ శాఖలో జరిగిన అవినీతి లీలలు, డాక్యుమెంట్ల మాయాజాలంపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు పెద్ద చేపలను వదిలి కిందిస్థాయి సిబ్బందిని బాధ్యులుగా చూపి పలువురిపై చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఇందుకు సూత్రధారి అయిన ఆ కీలక అధికారి మాత్రం సేఫ్ జోన్ లో ఉండి తప్పించుకున్నారు. ఇప్పుడు ఎక్కడికక్కడే సద్దుమనగడంతో మరోసారి కొత్త వ్యవహారానికి తెరలేపారు. సదరు ఆ అధికారి సహకారంతో ఏకంగా నాన్ లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం పెండింగ్ డాక్యుమెంట్ పేరుతో కొత్త వసూళ్లకు తెర లేపారు. అందుకోసం రాజకీయ నేతలతో, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలిపి ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ లతో తతంగం నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దారిలోనే బైపాస్ రోడ్డు, నాల్కల్ రోడ్డు, వినాయక్ నగర్ లోని పలు నాన్ లే అవుట్ పాట్లను రిజిస్ట్రేషన్లు చేసినట్లు సమాచారం. ఇలా ఇక్కడి నుంచే గజానికి లెక్క కట్టి మరీ వసూలు చేశారు. ముందుగా 13 డాక్యుమెంట్లను పెండింగ్లో పెట్టి ఇప్పటికే ఆరు డాక్యుమెంట్లను పూర్తి చేసి రైటర్లకు అప్పగించడం గమనార్హం. ఇందుకోసం లక్షల రూపాయలు చేతులు మారాయి. మిగిలిన మరో ఏడు డాక్యుమెంట్లను రెగ్యులర్ డాక్యుమెంట్లుగా చేసేందుకు మరి కొంత సొమ్ము చేతులు మారినట్లు ఆ శాఖతో పాటు డాక్యుమెంట్ రైటర్లు సైతం కోడై కూస్తున్నారు.


కామారెడ్డిలోను ఇదే తంతు...

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ ఇదే తంతు జరుగుతుంది. ఇక్కడ పని చేసిన రెగ్యులర్ సబ్ రిజిస్టార్ శ్రీలతను రాజకీయ ఒత్తిడితో, రియల్ ఎస్టేట్ మాఫియా బలంతో డిప్యూటేషన్ పై నిజామాబాద్ ఆడిట్ కు బదిలీ చేశారు. ఈమె స్థానంలో జిల్లా రిజిస్టార్(డి.ఆర్) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ ను ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ గా నియమించారు. ఇక్కడే అసలు తంతు మొదలైంది. నాన్ లేఅవుట్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఏకంగా బిఆర్ఎస్ పార్టీ నేత ముజీబుద్దిన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి సబ్ రిజిస్టార్ శ్రీలతను బదిలీ చేయాలని ఒత్తిడి చేశారు. చివరకు అధికార బలంతో అనుకున్నది సాధించారు. ఆమె స్థానంలో ప్రవీణ్ ను నియమించారు. ఇక్కడ నుంచి నాన్ లేవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు తెరలేచింది. దీంట్లో కూడా జిల్లా స్థాయి అధికారి హస్తం ఉండటంతో ఇన్చార్జి  రిజిస్ట్రార్ లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల అధికార పార్టీ నేత,మరో వ్యాపారవేత్తకు చెందిన నాన్ లేఔట్ ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేశారు. ముందుగా ఈ ప్లాట్ల డాక్యుమెంట్ల ను పెండింగ్ లో పెట్టీ, ఆ తర్వాత కొద్ది రోజులకు రెగ్యులర్ నెంబర్ల ఇచ్చారు.  మరికొన్ని డాక్యుమెంట్లను పెండింగ్ లో పెట్టారు. త్వరలో వీటిని రిజిస్ట్రేషన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనిపై జిల్లా రిజిస్ట్రార్ ను ఫోన్ ద్వారా వివరణ కోరెందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.