గంజాయిపై పోలీస్ బాస్ నజర్... సిపి ఘాటైన హెచ్చరిక... రంగంలోకి ప్రత్యేక బృందం... ఇప్పుడైనా గాడిలో పడేనా..?

Submitted by SANJEEVAIAH on Sun, 17/09/2023 - 07:23
Photo

గంజాయిపై "పోలీస్ బాస్" నజర్ 

ఘాటు తగ్గించేందుకు ఘాటైన హెచ్చరిక

రంగంలోకి ప్రత్యేక బృందం

ఆ పోలీసు అధికారుల సంగతేమిటి

ఇప్పటికైనా గాడిలో పడేనా.?

నిజామాబాద్ క్రైమ్, ప్రజాజ్యోతి, సెప్టెంబర్ 16 :

నిజామాబాద్ జిల్లాలో గంజాయి ఘాటుపై పోలీసు బాస్ సీరియస్ గా ఉన్నారు. గంజాయితో పాటు మత్తు పదార్థాల నియంత్రణపై ఏకంగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం విశేషం. జిల్లాలో గంజాయి సరఫరాపై మంత్రి ప్రశాంత్ రెడ్డి సూచించడంతో జిల్లా పోలీసు బాస్ సత్యనారాయణ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి అటు పోలీసులకు ఇటు గంజాయి తరలించే వారికి, కొనుగోలు చేసే వారికి కూడా ఘాటుగానే హెచ్చరించారు. బాస్ చర్యలతోనైన జిల్లాలో గంజాయి ఘాటు తగ్గుతుందని చర్చ మొదలు అయింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కలియతిరిగి పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేయడం, ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి పోలీసుల పని విధానంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. 

ఘాటు తగ్గేనా..?

కరీంనగర్, రామగుండం, హైదరాబాద్ పాతబస్తీ, రాచకొండ లో తనదైన ముద్ర వేసుకున్న పోలీస్ కమిషనర్ సత్యనరాయణ పోలీస్ కమిషనర్ గా జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. అయిదు నెలల పాటు పోలీస్ కమిషనర్ లేకపోవడంతో వ్యవస్థ పూర్తిగా పట్టు తప్పింది. దానికి తోడు జిల్లాలో పోలీసు శాఖలో రాజకీయ నేతల జోక్యం ఎక్కువ కావడం పోలీసులకు సవాల్ గా మారింది. నియోజక వర్గ స్థాయిలో ఎమ్మెల్యేల కనుసన్నలలో కీలకమైన అంశాలు జరగడంతో పోలీసులపై ఆరోపణలు పెరిగాయి. దానికి తోడు ఏం ఐ ఎం, అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు పరోక్షంగా గంజాయి, గుట్కా, కల్లులో కలిపే మత్తు పదార్థాలైన క్లోరోఫాం, డైజోఫామ్, షాక్రిన్ లాంటి పదార్ధాలతో పాటు రేషన్ బియ్యం, ఇసుక అక్రమ రవాణా జిల్లాలో యదేచ్ఛగా సాగుతుంది. ఎక్కడ పోలీసు అధికారి స్పందించిన వెంటనే ఏం ఐ ఎం, అధికార పార్టీ నేతల నుంచి ఫోన్ మోగుతుంది. ఇటు పోలీస్ బాస్ లేకపోవడంతో నేతల ఒత్తిడి భరించలేక పోలీసులు మౌనం పాటించారు. దీనిని అదునుగా చూసుకొని ఇద్దరు, ముగ్గురు పోలీసు అధికారులు ఏకంగా అక్రమ వ్యవహారాలకు వత్తాసు పలికి అందిన కాడికి దండుకున్నారు. ఇటీవల ఏం ఐ ఏం పార్టీకి చెందిన ఓ స్థాయి నాయకుడు గంజాయి సరఫరా చేస్తూ అదిలాబాద్ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తుంది. సదరు నాయకుడిపై, మరో నేతలపై కేసులు ఉన్న సంగతి తెలిసిందే. వీరికి పోలీసు శాఖ నుంచే అండదండలు ఉండటంతో జిల్లాలో గంజాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. 

కొరడా జులిపించుడే....

కొత్తగా బాధ్యతలు స్వీకరించిన పోలీస్ కమిషనర్ సత్యనారాయణ రాకతో గంజాయి వ్యాపారులకు ఘాటు ఎక్కినట్లు అవుతుంది. ఇప్పటికే సిపి ఎక్కడెక్కడ పని చేశారు. పని తీరు ఏమిటి అని ఆరా తీసి నోరు వెళ్ళపెడుతున్నారు. రాష్ట్రంలోనే సమస్యాత్మకమైన పాత బస్తీలో సిపి తనదైన ముద్రతో పని చేశారని ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. అలాగే సీపిగా పని చేస్తున్న ఐజిగా పదోన్నతి పోదే అవకాశం ఉంది. సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా వచ్చారని చెప్పుకుంటున్నారు. దీనికి తోడు క్రైంపై పట్టు ఉండటమే కాకుండా ప్రత్యేకంగా నిత్యం రంగంలో ఉంటారని పాత నేరస్తులు చర్చించుకోవడం విశేషం. ఏదిఏమైనా జిల్లాలో గంజాయి ఘాటుతో యువత అల్లాడిపోతోంది. ఈ సమయంలో సిపి సత్యనారాయణ గంజాయిపై దృష్టి పెట్టడంపై బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.