భద్రతను విస్మరించే అభివృద్ధా..!!

Submitted by Praneeth Kumar on Fri, 04/08/2023 - 08:10
Development ignoring safety..!!

భద్రతను విస్మరించే అభివృద్ధా..!!
◆ నదీ తీర ప్రాంతాలకు మోసే సామర్థ్యం ఎంత.

ఖమ్మం, ఆగస్ట్ 4, ప్రజాజ్యోతి.

తెలంగాణాలోని పలు జిల్లాల్లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లా హైవేలతో సహా వందలాది రోడ్ల పై వాహనాలను వాగులు నిరోధించాయి. అనేక పెద్ద జలవిద్యుత్‌ డ్యామ్‌లు వరదల ముప్పు కారణంగా ప్రణాళిక లేకుండా నీటిని విడుదల చేశాయి. అడివి, పర్వత ప్రాంతాల్లో ప్రాజెక్ట్‌లను ఎలా మెరుగ్గా నిర్వహించాలి, తీసుకునే నిర్ణయాల్లో ప్రజలను ఎలా భాగస్వాములను చెయ్యాలి అనే విషయాల పై ఇవి కీలకమైన పాఠాలను అందిస్తున్నాయి. పర్యావరణం, జీవితం, ఆస్తి వంటి విషయాల్లో మెరుగైన భద్రత కావాలంటే, సమర్థమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అడవులను నాశనం చేస్తూనే విపత్తులను నివారించగలమా..?? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు కూడా వెతకాల్సి ఉంటుంది.  

అడవుల ప్రాంత రాష్ట్రమైన తెలంగాణాలో జూలై నెలలో వరదలతో అతలాకుతలమయ్యాయి. ఈ వరదలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాథమిక సమస్యలను ఎత్తి చూపుతున్నాయి. ఈ వరదల్లో అత్యధికంగా దెబ్బ తిన్నది రైతే. జూలై మొదటి రోజులలో కొన్ని జిల్లాలో 50 నుండి 60 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతంతో పోలిస్తే, సగటున రోజూ 100 మి.మీ. నమోదైంది. కొన్ని జిల్లాల్లో జూలై మొదటి 10 రోజులలో సాధారణం నుండి సంచిత వర్షపాతం కంటే కొంచెం ఎక్కువగా ఉంది. 

కుండపోత వర్షం భారీ నష్టాన్ని మిగిల్చింది. జూలై వరకు సుమారు 25 మంది చనిపోయినట్లు ప్రభుత్వం నివేదించింది. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకమైన, అన్ని వాతావరణాల్లో పనిచేసే పలు జిల్లాల హైవేతో సహా వందలాది రోడ్ల పై వాహనాలను వరదలు దాదాపు నిరోధించాయి. దీనివల్ల నివాసితులకు, పర్యాటకులకు కష్టాలు, ఆర్థిక నష్టాలు ఎదురయ్యాయి. కొన్ని చోట్ల వంతెనలు కూలి పోవడంతో జిల్లాల మధ్య రాకపోకలు దెబ్బతిన్నాయి.
విద్యుత్, నీటి సరఫరాలకు అంతరాయం ఏర్పడి పాఠశాలలు చాలా రోజులు మూతపడ్డాయి. వంతెనలు మునిగిపోయాయి లేదా కూలిపోయాయి. కొండచరియలు విరిగిపడటమే కాకుండా వరదలు పట్టణాలను ముంచెత్తాయి. జిల్లా హైవేలు విచ్ఛిన్నమైపోయాయి. అనేక భవనాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా గ్రామాల్లో వినాశనం మరింత స్పష్టంగా కనిపించింది.
ఈ విపత్తు సమయంలో గోదావరి అత్యంత విధ్వంసకరంగా మారింది. సహజ కారణాల వల్ల మాత్రమే కాదు, గోదావరి నది పరివాహక ప్రదేశంలోని అనేక పెద్ద జలవిద్యుత్‌ డ్యామ్‌లు, తమ ప్రాంతాలలో వరదల ముప్పు కారణంగా అకస్మాత్తుగా ప్రణాళిక లేకుండా నీటిని విడుదల చేశాయి. ఇప్పటికే పొంగి పరవళ్లు తొక్కు తున్న గోదావరి నదిలోకి ఈ అదనపు ఉప్పెనలు వెల్లువెత్తి దిగువ ప్రాంతాల్లో నష్టాలను అధికం చేశాయి. చాలా జిల్లాలో ఇలాంటి సమస్యలే కనిపించాయి.
నదీ పర్యావరణ వేత్తలు, యాక్టివిస్టులు పదేపదే చెబుతూ వచ్చినట్లుగా జలశక్తి లేదా పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులకు సంబంధించిన కేంద్ర మంత్రిత్వ శాఖలు, శాస్త్రీయంగా పర్యావ రణ ప్రవాహాలను ఏర్పాటు చేసి, డ్యామ్‌ ఆపరేటర్లు వాటిని అనుసరించేలా చూసినట్లయితే, ఆనకట్ట సంబంధిత సమస్యలను గణనీయంగా తగ్గేవి.
మౌలిక సదుపాయాల సైట్ల చుట్టూ కూడా కనీవినీ ఎరుగని విధ్వంసం సంభవించింది. చిన్న పర్వత ప్రవాహాలు, పరిమితమైన వరదను భరించే సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. ప్రాజెక్టుల నుండి నిర్మాణ శిథిలాలు అటువంటి ప్రవాహాలలోకి డంప్‌ అవుతున్నాయి. వరదను భరించే వాటి సామర్థ్యాన్ని అవి మరింతగా తగ్గిస్తున్నాయి.
ఇటువంటి ప్రాజెక్టులను తరచుగా పేలవమైన ప్రణాళికలతో, నిర్మాణ గడువులను వేగంగా చేరుకునే లక్ష్యంతో నాసిరకంగా నిర్మిస్తారు.
రాష్ట్రంలో కొన్ని చోట్ల, హైవేలను వాస్తవానికి  చెరువుల ఒడ్డున నిర్మించారు. ఇక్కడ రహదారిని మెత్తటి నిక్షేపాల పై నిర్మించి ఉండవచ్చు. దీంతో నేల కోత మరిన్ని ఇబ్బందులకు కారణమైంది. అయితే హైవే డెవలపర్లు, ఇంజినీర్లు జరుగుతున్న పెను విపత్తుల నుండి ఏ పాఠాలూ నేర్చుకోవడం లేదు.
జిల్లాలో చాలా చోట్ల నదీ తీరాలకు కనీసం 100 మీటర్ల దూరంలో భవనాలు ఉండాలనే నిబంధనను కూడా ఉల్లంఘించడంతో, భాహుళంతస్తుల భవనాలు సైతం కూలి పోతున్నాయి. నిజానికి నది, వాగుల ఒడ్డున గృహ సముదాయాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి. నదీతీర పట్టణాలలోనూ ఇదే విధమైన ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పెరుగుతున్న వాతావరణ కార్బన్‌ డై ఆక్సైడ్‌ స్థాయులు, భూతాపం, అధిక సముద్ర ఉష్ణోగ్రతలు ఎక్కువ తేమతో కూడిన మేఘాలను ఉత్పత్తి చేస్తాయి. అయితే స్థానిక పరిస్థితులు అత్యధిక వర్షపాత సంఘటనలను నిర్ణయిస్తాయి. భారతదేశంలో, ప్రపంచ వ్యాప్తంగా కూడా వర్షపాత తీవ్రత, తరచుదనం పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇవి అధిక జనాభా ఉన్న లేదా ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో సంభవించినప్పుడు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా ఉంటుంది. పర్యావరణం, జీవితం, ఆస్తి వంటి విషయాల్లో మెరుగైన భద్రత కావాలంటే, సమర్థవంతమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. నిర్మాణ సమయంలోనూ ఆ తర్వాత కూడా నిజాయితీగా, క్రమబద్ధమైన పర్యవేక్షణను చేపట్టాలి. ఇవన్నీ సాధ్యపడా లంటే మంచి పాలన అవసరం ఉంటుంది. అధిక వర్షపాతాన్ని, వరద తీవ్రతలను తట్టుకునే నిర్మాణ భద్రతాంశాలు మెరుగ్గా ఉండి, మంచి ఇంజినీరింగ్‌ పద్ధతులకు కట్టుబడి ఉంటే మరణాల సంఖ్య, విధ్వంసం తగ్గుతాయి.
ప్రేరేపిత విపత్తులు సంభవించినప్పుడు ప్రజల జీవితాలు ప్రమాదంలో పడతాయి కాబట్టి, మౌలిక ప్రాజెక్టుల ప్రణాళిక, మంజూరు, పర్యవేక్షణలో ప్రజలు సమర్థమైన స్వరాన్ని కలిగి ఉండాలి. నిజాయితీగా సిద్ధం చేసిన పర్యావరణ ప్రభావ అంచనాలు, పబ్లిక్‌ హియరింగ్‌లు వంటివి ప్రకృతి, జీవితాలు, ఆస్తికి చెందిన భద్రతలను పెంచడంలో సహాయపడతాయి. నియంత్రణ వ్యవస్థలు, పర్యావరణ ప్రభావిత అంచనాలకు సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ క్రమానుగతంగా బలహీనపడటం అనేది ప్రజలకు, ప్రకృతికి వ్యతిరేక మైనది. సమర్థవంతమైన ఆర్థిక వృద్ధి పేరుతో పాలనా యంత్రాంగం ఎన్ని వాదనలు చేసినప్పటికీ వాటన్నింటినీ ఖండించాలి.

చివరగా, మరిన్ని పెద్ద ప్రశ్నలు వేసుకుందాం.
సున్నితమైన నదీ తీరం ప్రాంతానికి ఉన్న మోసే సామర్థ్యం ఎంత..?? స్థిరమైన ఆర్థిక వృద్ధికి పరిమితులు ఏమిటి..?? మనం అడవులను ఇంకా నాశనం చేస్తూనే విపత్తులను నివారించగలమా..?? పర్యావరణ సున్నితమైన నదీ లోయల గుండా తమ వాహనాలను నడపడానికి మరింత మంది పర్యాటకులను ప్రోత్సహిస్తూనే ఉందామా..?? ఇప్పుడు వీటన్నింటికీ సమాధానాలు వెతకాల్సిన బాధ్యత ప్రజల పై ఉందన్నది మా వాదన.