కాంగ్రెస్ లో మండల అధ్యక్షుల కుంపటి... మండల అధ్యక్షుల నియామకంపై గాంధీభవన్ వద్ద నిరసన... పిసిసికి ఫిర్యాదు చేస్తున్న నేతలు...

Submitted by SANJEEVAIAH on Mon, 10/07/2023 - 21:12
Photo

కాంగ్రెస్ లో మండల అధ్యక్షుల కుంపటి -

రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు -

ఏకపక్షంగా వ్యవహారించారని ఫిర్యాదులు -

నియామకాలు పూర్తి చేసిన అధ్యక్షులు -

ఎల్లారెడ్డి, జుక్కల్, బాల్కొండలో ముదిరిన వివాదం

గాంధీభవన్ లో నిరసన

(నిజామాబాద్ ప్రతినిధి - ప్రజాజ్యోతి - ఏడ్ల సంజీవ్) ఉమ్మడి జిల్లా కాంగ్రెస్లో మండల అధ్యక్షుల నియామకం వివాదాస్పదం అవుతుంది. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గంలో నిజామాబాద్ అర్బన్, బాల్కొండ, బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలలో మండల అధ్యక్షుల నియామకం అంతర్గత కుమ్ములాటలకు కేంద్రంగా మారింది. ఎవరికి వారే ఈ నియమకాలపై పిసిసి వరకు ఫిర్యాదులు చేసుకోవడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో మండల అధ్యక్షులు పాత్ర క్రియశీలంగా ఉండడంతో బరిలో నిలిచేవారు తమ వారికి ఇప్పించే ప్రయత్నంలో చక్రం తిప్పారు. ఇలా నెగ్గించుకున్నవారు సంబరంగా ఉంటే తమవారికి రానివారు ఫిర్యాదులు చేసే పనిలో పడ్డారు. ఇది కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ మూడు నియోజకవర్గాలలో మరింత వివాదాస్పదం అయింది. ఎక్కడి వారు ఏకంగా సోమవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు వెళ్ళి మరి ఆందోళన చేసి ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లాలో అర్బన్ బాల్కొండ మిగిలిన నియోజకవర్గం మమ అనిపించారు. దీంతో ఎక్కడికక్కడే అంతర్గతంగా కుమ్ములాట మొదలైంది. ఇది సంగతి కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి లో మదన్మోహన్ వర్సెస్ సుభాష్ రెడ్డిల తీరు నువ్వా నేనా అన్నట్లుగా మారింది. ఈ నియోజక వర్గంలో మండల అధ్యక్షులు నియామకంలో డిసిసి వివాదాస్పదం అయింది. సుభాష్ రెడ్డికి సంబంధించి వ్యక్తులకే మండల అధ్యక్షులుగా నియమించారు. దీంతో మదన్మోహన్ నియామకాలపై పిసిసికి ఫిర్యాదు చేశారు. మండల అధ్యక్షులను మార్పు చేయాలని పట్టు పట్టారు. ఇక్కడ రేవంత్ రెడ్డి షబ్బీర్ అలీ వర్గం అంటూ ఎవరికి వారే మండల అధ్యక్షుల నియామకాలపై వివాదం చేసి కొత్త సమస్య తలెత్తింది. ఇదే దారిలో జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గంలో ఇదే తంతు కొనసాగింది. జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సౌధాఘర్ గంగారాం అనుచరాలని నియమించారు. దీంతో ఇటు గడుగు గంగాధర్, లక్ష్మి కాంతారావు తమ అనుచరులకు మండల అధ్యక్షులుగా అర్హత కలిగిన వారిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. పనిచేసే వారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నవారికి మండలాధ్యక్షలుగా నియమించారని ఆరోపించారు. బాన్సువాడ నియోజక వర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది. అలాగే నిజామాబాద్ అర్బన్, బాల్కొండ నియోజకవర్గాలలో ఇదే జరిగింది. బాల్కొండలో డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి వర్సెస్ ఈరవత్రి అనిల్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. ఇక్కడి నుంచి కూడా మండల అధ్యక్షులు నియామకాలపై ఫిర్యాదులు వెళ్లడం విశేషం. దీంతో సోమవారం ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ కు చెందిన నాయకులు గాంధీ భవన్ వెళ్ళి నిరసన తేలడంతో వివాదాలు తేటతెల్లం అయ్యాయి. సయోధ్య కరువు ఎన్నికల్లో టికెట్ల సంగతి ఎలా ఉన్నా మండలాధ్యక్షుల నియామకాలతోనే కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాట మొదలైంది. నా వాళ్లకు అంటే నా వాళ్లకు అంటూ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి మండల అధ్యక్షులు నియామకలపై కాలుదువ్వతున్నారు. కానీ డిసిసి అధ్యక్షులు ముందస్తుగానే జాబితా సిద్ధం చేసుకుని నియామకాలు చేపట్టారు. అయితే డిసిసి అధ్యక్షులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆయా నియోజకవర్గాలలో టికెట్ ఆశిస్తున్న వారు అంతర్యుద్ధానికి తెర లేపారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొత్త తలనొప్పి మొదలైంది. ఎవరికి వారే జిల్లాల ఇన్చార్జి లైన సుదర్శన్ రెడ్డి షబ్బీర్ అలీ వద్ద తమ గోడు చెప్పుకోవడం గమనార్హం. ఈ మండల అధ్యక్షుల నియామకం కుంపటి కాంగ్రెస్ లో ఎప్పుడు చల్లారుతుందో వేచి చూడాలి మరి...