వైద్య రంగంలో కీలక ముందడుగు… చిన్న రక్త పరీక్షతో క్యాన్సర్ ముప్పు గుర్తింపు

V. Sai Krishna Reddy
2 Min Read

క్యాన్సర్ మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతున్న తరుణంలో వైద్య రంగంలో ఒక కీలక ముందడుగు పడింది. లక్షణాలు బయటపడక ముందే, కేవలం ఒక సాధారణ రక్త పరీక్ష ద్వారా అనేక రకాల క్యాన్సర్లను గుర్తించే సరికొత్త విధానం అందుబాటులోకి రాబోతోంది. ఈ ‘లిక్విడ్ బయాప్సీ’ పరీక్ష ద్వారా, వ్యాధి ముదిరిపోయి నాలుగో దశకు చేరే కేసులను గణనీయంగా తగ్గించవచ్చని ఓ సంచలనాత్మక అధ్యయనం వెల్లడించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ఒక్క 2020లోనే క్యాన్సర్ వల్ల కోటి మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రొమ్ము, గర్భాశయ, పెద్దప్రేగు వంటి కొన్ని క్యాన్సర్లకు మాత్రమే ప్రామాణిక స్క్రీనింగ్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. దీంతో 70 శాతానికి పైగా కొత్త క్యాన్సర్ కేసులు, లక్షణాలు ముదిరిన తర్వాతే బయటపడుతున్నాయి. దీనివల్ల చికిత్స కష్టమవడమే కాకుండా, ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతోంది. అయితే, ఒకే రక్త నమూనాతో పదుల సంఖ్యలో క్యాన్సర్లను గుర్తించే ‘మల్టీ-క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్’ (MCED) టెస్టులు ఈ పరిస్థితిని మార్చగలవని పరిశోధకులు చెబుతున్నారు.

 

అమెరికన్ క్యాన్సర్ సొసైటీకి చెందిన ‘క్యాన్సర్’ అనే ప్రముఖ జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. ‘క్యాన్సర్‌గార్డ్’ అనే టెస్టును ఉపయోగించి ఈ పరిశోధన చేశారు. అమెరికాలోని 50 లక్షల మంది ప్రజల (50-84 ఏళ్ల మధ్య వయస్కులు) 10 సంవత్సరాల డేటాను తీసుకుని, వారికి ఏటా ఈ రక్త పరీక్ష చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో సిమ్యులేషన్ ద్వారా అంచనా వేశారు.

ఈ సిమ్యులేషన్ ఫలితాలు అద్భుతమైన మార్పును సూచించాయి. ఈ పరీక్ష వల్ల క్యాన్సర్‌ను మొదటి దశలో గుర్తించే కేసులు 10%, రెండో దశలో 20%, మూడో దశలో 30% పెరిగాయి. అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, వ్యాధి ముదిరిపోయి చివరిదైన నాలుగో దశలో బయటపడే కేసులు ఏకంగా 45% తగ్గాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, పెద్దప్రేగు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లలో నాలుగో దశ కేసులు గణనీయంగా తగ్గుతాయని తేలింది.

ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన డాక్టర్ జగ్‌ప్రీత్ చట్వాల్ మాట్లాడుతూ.. “ఈ మల్టీ-క్యాన్సర్ రక్త పరీక్షలు క్యాన్సర్ నియంత్రణలో ఒక గేమ్-ఛేంజర్‌గా నిలుస్తాయి. వ్యాధి శరీరమంతా వ్యాపించక ముందే గుర్తించడం వల్ల ప్రాణాలను కాపాడటంతో పాటు, రోగులపై వ్యక్తిగత, ఆర్థిక భారం కూడా తగ్గుతుంది” అని వివరించారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *