నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పల్నాడు జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు.
వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల నుంచి తిరుమల దర్శనానికి ఓ కుటుంబం బంధువులతో కలిసి వ్యాన్లో వెళ్తుండగా, నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం చాకిచెర్ల వద్ద వీరి వాహనాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నంబుల వెంకట నరసమ్మ, సుభాషిని, అభిరామ్ మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఈ ప్రమాద ఘటనపై రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం తీరని లోటని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు
