• అమలు చేయకుంటే పదవి నుండి తొలగించవచ్చునని హామీ
__________________________________________
నర్సాపూర్/మెదక్ (ప్రజాజ్యోతి) ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు హామీలు ఇవ్వడం సర్వసాధారణం. అయితే, మెదక్ జిల్లాలో ఒక సర్పంచ్ అభ్యర్థి ఏకంగా 100 రూ” బాండ్ పేపర్‌పై 15 హామీలను రాసిచ్చి, వాటిని అమలు చేయకపోతే తనను సర్పంచ్ పదవి నుంచి తొలగించవచ్చని పేర్కొనడం సంచలనంగా మారింది. హవేలీ ఘన్పూర్ మండలం రాజుపేట తండా, కాప్రాయిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థి “కుక్కల మౌనిక” ఓటర్ల విశ్వాసం చూరగొనేందుకు వినూత్నంగా ఈ ప్రకటన చేశారు. బాండ్ పేపర్‌పై ఇచ్చిన హామీలు ఆడపిల్ల పుడితే ఆర్థిక సాయం,గ్రామంలో ఆడపిల్ల జన్మిస్తే వారికి రూ. 2,000 ఆర్థిక సాయం, పండుగలకు విరాళంగా తీజ్ పండుగకు రూ. 20,000, ముదిరాజ్ బోనాల పండుగకు రూ. 8,000, ఎల్లమ్మ బోనాల పండుగకు రూ. 3,000 విరాళం ఇస్తానని, గ్రామంలో ఎవరైనా అకాల మరణం చెందితే అంత్యక్రియల రూ. 5,000 ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీలను గెలిచిన తర్వాత అమలు చేయని పక్షంలో, తనను జిల్లా కలెక్టర్ ద్వారా కానీ, లేదా జిల్లా న్యాయస్థానం ద్వారా కానీ సర్పంచ్ పదవి నుంచి తొలగించుకోవచ్చని ఆమె బాండ్ పేపర్‌పై స్పష్టంగా పేర్కొన్నారు.
