ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రంగా స్పందించారు. రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్న ‘తలతిక్క మాటలు’ వెంటనే మానుకోవాలని, లేకపోతే తెలంగాణలో భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన గట్టిగా హెచ్చరించారు.
గత వారం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్, సముద్రపు నీటి వల్ల దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా, “ఇక్కడి పచ్చని కొబ్బరి చెట్లను చూసే ప్రత్యేక రాష్ట్ర (తెలంగాణ) డిమాండ్ వచ్చిందేమో” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే తాజా వివాదానికి కారణమయ్యాయి.
పవన్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీహరి మండిపడ్డారు. “తెలంగాణ వనరులు వాడుకుని ఈ స్థాయికి ఎదిగావు. రాజకీయ మైలేజ్ కోసం రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టడం సరికాదు. అన్నదమ్ముల్లా విడిపోయిన మనం కలిసుండాలి” అని శ్రీహరి హితవు పలికారు. పనితనంతో ప్రజల మెప్పు పొందాలని, అనవసర వ్యాఖ్యలతో కాదని సూచించారు. తన వ్యాఖ్యలను పవన్ వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు.
