చైనాకు ప్రత్యామ్నాయం తెలంగాణనే: ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

V. Sai Krishna Reddy
2 Min Read

భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే ప్రపంచ పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, భద్రత, భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానమని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో (USISPF) పాల్గొన్న సీఎం, “తెలంగాణ రైజింగ్ 2047” విజన్‌ను ఆవిష్కరించి, రాష్ట్రంలోని అవకాశాలను వివరించారు.

దేశంలోనే అత్యధిక యువత, వేగవంతమైన వృద్ధి రేటుతో తెలంగాణ దూసుకుపోతోందని రేవంత్ రెడ్డి తెలిపారు. గత 35 ఏళ్లుగా కాంగ్రెస్‌తో సహా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, పెట్టుబడులకు, పెట్టుబడిదారులకు సంపూర్ణ మద్దతు ఇచ్చిందని, ఈ విషయంలో రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం ఉందని ఆయన గుర్తుచేశారు. అందుకే భారత్‌లో పెట్టుబడులకు హైదరాబాద్‌ను ముఖద్వారంగా చూడాలని ఆయన పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.

మహిళా సాధికారత, నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్య శిక్షణ, అత్యున్నత జీవన ప్రమాణాలతో హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడమే తన ప్రథమ ప్రాధాన్యత అని సీఎం వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న పలు కీలక ప్రాజెక్టుల గురించి ఆయన ప్రస్తావించారు. 30 వేల ఎకరాల్లో నిర్మించతలపెట్టిన “భారత్ ఫ్యూచర్ సిటీ” దేశంలోనే ఒక నూతన నగరంగా నిలుస్తుందన్నారు. మూసీ నది పునరుజ్జీవనం పూర్తయితే లండన్, దుబాయ్, టోక్యో నగరాల తరహాలో హైదరాబాద్‌లో నైట్ ఎకానమీ కొత్త రూపు సంతరించుకుంటుందని తెలిపారు. డ్రై పోర్ట్, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులతో పాటు “చైనా ప్లస్ వన్” మోడల్‌కు ప్రపంచవ్యాప్త సమాధానం తెలంగాణనే అవుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ఆసక్తికరమైన ప్రతిపాదనలు చేశారు. హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ వంటి ప్రఖ్యాత ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తే, గ్లోబల్ సౌత్ దేశాల విద్యార్థులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని అన్నారు. అదేవిధంగా, హైదరాబాద్‌లో రోడ్లకు నేతల పేర్లు పెట్టే సంప్రదాయాన్ని మార్చి, గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి గ్లోబల్ కంపెనీల పేర్లను పెడతామని ఆయన చేసిన ప్రకటన సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగానికి, ఆయన ఆవిష్కరించిన విజన్‌కు అంతర్జాతీయ వ్యాపార వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. టెక్ దిగ్గజం, సిస్కో మాజీ సీఈఓ జాన్ చాంబర్స్ మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ చాలా సాహసోపేతంగా, స్పష్టంగా, సాధించగలిగేలా ఉంది. ఆయన చెప్పిన ప్రాజెక్టులు ఎంతో ప్రేరణ కలిగించాయి,” అని ప్రశంసించారు. సీఎం ఆహ్వానం మేరకు డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే “తెలంగాణ రైజింగ్” గ్లోబల్ సమ్మిట్‌కు అత్యధిక సభ్యులతో హాజరవుతామని, తెలంగాణ విజన్‌ను దగ్గరగా చూసేందుకు ఆసక్తిగా ఉన్నామని USISPF అధ్యక్షుడు డా. ముఖేష్ ఆఘి తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *