- వరంగల్ బస్టాండ్ లో పడవ ప్రయాణం
- ప్రయాణికులకు బస్సులకు బదులు పడవలు వచ్చేలా చేసిన స్థానిక మంత్రి కొండా సురేఖకి అభినందనలు
- బిజెపి రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార
- మంత్రిగా ఉండి తూర్పు నియోజకవర్గం ప్రజలకు చేసింది శూన్యం
వరంగల్ సిటీ, నవంబర్ 13(ప్రజాజ్యోతి):
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా పేరొందిన వరంగల్ జిల్లా కేంద్రానికి కనీసం బస్టాండ్ లేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఉన్న బస్టాండ్ ను కూల్చి ఏళ్ళు గడుస్తున్న కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చిన పరిస్థితి లేదు. అడుగు భాగంలో మట్టిని తోడి అలాగే వదిలేయడంతో పెద్ద స్విమ్మింగ్ పూల్ గా మారింది. దీనిపై వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆధ్వర్యంలో గురువారం బస్టాండు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. స్విమ్మింగ్ బోట్స్ తెప్పించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక మంత్రి కొండా సురేఖ, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ముఖాలతో ఉన్న మాస్కులు ధరించి వారిని ఆ నీళ్లలో బోట్ షికారు చేయించారు. వరంగల్ వాసులకు పడవ ప్రయాణం కల్పించిన మంత్రి సురేఖకు ధన్యవాదాలు అంటూ పూలు జల్లి నిరసన తెలిపారు. నిత్యం ప్రజలు బస్టాండ్ సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి రాజకీయాలపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని దుయ్యబట్టారు. వెంటనే బస్టాండ్ పనులు ప్రారంభించి తొందరగా నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, రత్నం సతీష్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, రాష్ట్ర నాయకులు కంభంపాటి పుల్లారావు, జిల్లా ప్రధాన కార్యదర్శిలు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, జలగం రంజిత్ రావు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల శ్రీరాములు మరియు జిల్లా, మండల పదాధికారులు, వివిధ మోర్చా జిల్లా అధ్యక్షులు, నాయకులు, మహిళా మోర్చా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

