కేంద్ర ప్రభుత్వ పథకాల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. వాట్సాప్ గ్రూపులలో వచ్చే సందేశాలను చూసి మోసపోవద్దని, అర్హత కోసం లింక్స్‌లపై క్లిక్ చేసి మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయవద్దని సూచించారు. ప్రభుత్వ పథకాల కోసం అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
వాట్సాప్ గ్రూపులలో సైబర్ నేరగాళ్లు ఫేక్ లింక్స్‌లను పంపి, కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయని నమ్మబలుకుతారని పేర్కొన్నారు. అర్హతను పరిశీలించుకోవాలని ఆశ చూపుతూ లింక్‌లను పంపుతారని, వాటిపై తొందరపడి క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. అపరిచితులు పంపించే లింక్స్, సందేశాలకు స్పందించవద్దని సూచించారు.
