తెలంగాణ పోలీస్ యంత్రాంగంలో ప్రభుత్వం భారీ స్థాయిలో మార్పులు చేపట్టింది. రాష్ట్రంలోని పలు కీలక విభాగాల్లో పనిచేస్తున్న 23 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పుల్లో భాగంగా, హైదరాబాద్ నగరానికి కొత్త పోలీస్ కమిషనర్‌గా వీసీ సజ్జనార్ నియమితులయ్యారు. ఆయన నియామకం పోలీస్ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సేవలందిస్తున్న సీవీ ఆనంద్‌ను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో, ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీ ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వీసీ సజ్జనార్‌ను నియమించారు. సజ్జనార్ బదిలీతో ఖాళీ అయిన ఆర్టీసీ ఎండీ పోస్టులో, తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల డీజీగా ఉన్న వై. నాగిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఇతర ముఖ్యమైన బదిలీల్లో, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా ఉన్న శిఖా గోయల్‌ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. సీఐడీ అదనపు డీజీపీ చారు సిన్హాకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా, ఆర్గనైజేషన్ అండ్ హోంగార్డ్స్ అదనపు డీజీపీ స్వాతి లక్రాకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) డీజీగా అదనపు బాధ్యతలు కేటాయించారు. శాంతిభద్రతల అదనపు డీజీపీ మహేశ్ భగవత్‌కు పర్సనల్ విభాగం అదనపు డీజీపీగా, ఏసీబీ డీజీగా ఉన్న విజయ్ కుమార్‌ను ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీగా బదిలీ చేశారు.
గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అదనపు డీజీపీగా డాక్టర్ అనిల్ కుమార్‌ను నియమించగా, పౌరసరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న దేవేంద్ర సింగ్ చౌహాన్‌ను మల్టీజోన్-2 అదనపు డీజీపీగా బదిలీ చేశారు. హైదరాబాద్ నగర శాంతిభద్రతల అదనపు కమిషనర్‌గా ఉన్న విక్రమ్ సింగ్ మాన్‌ను విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల డీజీగా నియమించారు. గ్రేహౌండ్స్ ఏడీజీపీగా ఉన్న స్టీఫెన్ రవీంద్రను పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చారు.
వీరితో పాటు పలు జిల్లాల ఎస్పీలు, నగరంలోని డీసీపీల స్థాయిలోనూ బదిలీలు జరిగాయి. హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ ఎస్.ఎం. విజయ్ కుమార్‌ను సిద్దిపేట పోలీస్ కమిషనర్‌గా బదిలీ చేయగా, ఆయన స్థానంలో ఛ. శ్రీనివాస్‌ను నియమించారు. సిద్దిపేట సీపీగా ఉన్న డాక్టర్ బి. అనురాధను రాచకొండ ఎల్బీ నగర్ జోన్ డీసీపీగా బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
