జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ ఉప ఎన్నికలో తమ సత్తా చాటుతామని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించి తీరుతామని మాల సామాజికవర్గ నేతలు ప్రకటన చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశమైన అనంతరం వారు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా మాల సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ, ఎస్సీ రిజర్వేషన్ల అమలు విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించడం లేదని వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగానే తాము రాజకీయంగా తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
“కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని నిలబెట్టినా, మా ఐక్యతతో ఓడించి తీరుతాం. మా సత్తా ఏంటో కాంగ్రెస్ పార్టీకి చూపిస్తాం” అని మాల నేతలు అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమ అభ్యర్థులను పోటీలో నిలబెడతామని వారు ప్రకటించారు. కేటీఆర్‌తో జరిగిన సమావేశంలో ఎస్సీ రిజర్వేషన్ల అమలు తీరుపై చర్చించినట్లు వారు వివరించారు.
