-ఆర్డీఓ పార్థసింహరెడ్డి
ఎల్లారెడ్డి, ఆగస్టు 13(ప్రజా జ్యోతి):
నిరంతరం వర్షాల దృష్ట్యా రానున్న రెండు, మూడు రోజుల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో డివిజన్ లో ఉన్న అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎల్లారెడ్డి ఆర్డీఓ పార్థ సింహారెడ్డి అన్నారు. బుధవారం ఆర్డీఓ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కలిసి భారీ వర్షాలకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు తమ సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలన్నారు. తప్పనిసరిగా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశామని 24 గంటలు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకున్నమన్నారు. విద్యుత్, రెవెన్యూ, పోలీస్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రమాదకరంగా ఉండే నాలాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.పాఠశాలలు, హాస్టళ్లతో పాటు శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి ఖాళీ చేయించాలని అన్నారు. వరదలు, ప్రమాదాలు సంభవిస్తే అత్యవసర పరిస్థితిలో ఎల్లారెడ్డి ఆర్డీఓ కంట్రోల్ రూం నంబర్ 9492022475, లేదా జిల్లా 08468220069కు సమాచారం అందించాలని అన్నారు. అనంతరం ఎల్లారెడ్డి తహసీల్దార్ ప్రేమ్ కుమార్ అధ్యక్షతన భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మహేష్,తహసీల్దార్ ప్రేమ్ కుమార్, ఇరిగేషన్ డి ఇ వెంకటేశ్వర్లు, డి ఎల్ పి ఓ సురేందర్, ఫైర్ అధికారి వినోద్, విద్యుత్ శాఖ అధికారి ఏఈ వెంకటస్వామి, ఇంచార్జ్ ఎంపీడీవో ప్రకాష్, ఎస్సై బొజ్జ మహేష్, తదితరులు పాల్గొన్నారు.
