రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ గద్దెను అధికారులు కూల్చేశారు. నమాజ్ చెరువు కట్ట శివారులో విగ్రహ ఏర్పాటు పనులకు ఎలాంటి పర్మిషన్లు లేవంటూ ఇరిగేషన్ శాఖ అధికారులు గద్దెను జేసీబీతో నేలమట్టం చేశారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చెప్పారు. నమాజ్ చెరువు కట్టపై ఆయన విగ్రహ ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను కూల్చివేయడం దారుణమని అన్నారు. జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి పాలనలో తెలంగాణ మహనీయులకు ఇలాంటి అవమానాలు జరగడం మనసును కలచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి జయశంకర్ సార్ విగ్రహ ఏర్పాటుకు అనుమతిని ఇవ్వాలని… గద్దెను నిర్దాక్షిణ్యంగా కూల్చి వేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.