హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉప్పల్ – హబ్సిగూడ, మియాపూర్ – గచ్చిబౌలి మార్గాల్లో, వివిధ కూడళ్లలో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి ఐకియా మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైటెక్ సిటీ నుంచి కేపీహెచ్‌బీ మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కార్లు నీట మునిగాయి. మాదాపూర్ నెక్టార్ గార్డెన్ వద్ద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మలక్‌పేట, మూసారాంబాగ్ ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. నాలాల నుంచి మురుగు నీరు ఉప్పొంగుతోంది.
జీహెచ్ఎంసీ పరిధిలో రాత్రి పది గంటల వరకు భారీ వర్షం కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
కార్ల షోరూంలో చిక్కుకున్న సిబ్బంది
భారీ వర్షంతో రసూల్‌పురలోని పైగా కాలనీ విమాన నగర్‌లో వరద బీభత్సం సృష్టించింది. ఓ కార్ల షోరూమ్‌లోకి 4 అడుగుల మేర వరద చేరింది. దీంతో అందులో పనిచేస్తున్న సుమారు 30 మంది ఉద్యోగులు వరదలో చిక్కుకుపోయారు. తమను రక్షించాలని పోలీసులు, డీఆర్ఎఫ్, హైడ్రా అధికారులకు షోరూం సిబ్బంది సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన హైడ్రా వారిని వెనుక వైపు నుంచి రక్షించారు. చిన్న పడవలలో వారిని బయటకు తీసుకువచ్చారు.