హైదరాబాద్ నగరంలో చిన్నపాటి వర్షానికే రోడ్లు చెరువులను తలపించడం, ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోవడం సర్వసాధారణంగా మారింది. ఈ తీవ్ర సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కీలక అడుగులు వేసింది. వర్షపు నీటిని సమర్థంగా నిర్వహించడంతో పాటు, ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించే లక్ష్యంతో ‘వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ల’ నిర్మాణాన్ని చేపట్టింది.
తెలంగాణ ప్రభుత్వం చొరవతో నగరవ్యాప్తంగా సుమారు 50 ప్రాంతాల్లో ఈ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా, పైలట్ ప్రాజెక్టు కింద 12 అత్యంత రద్దీ ప్రాంతాలను ఎంపిక చేసి పనులు ప్రారంభించారు. ఇప్పటికే ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయం వద్ద, రాజ్‌భవన్ రోడ్‌లోని లేక్ వ్యూ అతిథిగృహం సమీపంలో, తెలంగాణ సచివాలయం వద్ద ఈ నిర్మాణాలు పూర్తయ్యాయి.
ఖైరతాబాద్‌లో నిర్మించిన స్ట్రక్చర్ సుమారు 4 లక్షల లీటర్ల వర్షపు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగి ఉంది. ఇక రాజ్‌భవన్ రోడ్డులో ఏర్పాటు చేసిన నిర్మాణం అత్యంత పెద్దది కాగా, ఇది ఏకంగా 10 లక్షల లీటర్ల నీటిని భూగర్భంలోకి ఇంకేలా చేస్తుంది. ఈ ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనా, రోడ్డుపై నీరు నిలవకుండా నేరుగా ఈ స్ట్రక్చర్లలోకి చేరుతుంది. అనంతరం, ఈ నీటిని మోటార్ల సహాయంతో సమీపంలోని డ్రైనేజీ వ్యవస్థ ద్వారా నాలాల్లోకి, అక్కడి నుంచి హుస్సేన్‌సాగర్‌కు, తద్వారా మూసీ నదిలోకి తరలించే ఏర్పాటు చేశారు.
లక్డీకపూల్, అమీర్‌పేట, రంగ్‌మహల్ వై జంక్షన్, లంగర్‌హౌస్, మెహిదీపట్నం, శేరిలింగంపల్లిలోని లోతట్టు ప్రాంతాల్లో కూడా ఈ తరహా నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వినూత్న విధానం వల్ల వర్షపు నీటి నిల్వ సమస్య తగ్గడమే కాకుండా, ట్రాఫిక్ కష్టాలు కూడా తీరుతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ స్ట్రక్చర్లలోని మోటార్లు సక్రమంగా పనిచేయకపోతే పాత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.