దామెర, మే 02 (ప్రజాజ్యోతి)::
హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామంలో 1,116 మంది దంపతులచే ధన్వంతరి సహిత హనుమాన్ మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్టు శ్రీశ్రీశ్రీ లక్ష్మీనారాయణ గురుభవాని తెలిపారు.
మే 2, 3, 4 (శుక్ర, శని, ఆది) ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు శ్రీ బాల మానస మహా విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ లక్ష్మీనారాయణ గురుభవాని తెలిపారు. శ్రీ గణపతి సహస్ర మోదక వాసవి కన్యకా పరమేశ్వరి మహాలక్ష్మి సహిత ధన్వంతరి సహిత హనుమాన్ ఆరవ మహాయజ్ఞం లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. పులుకుర్తి గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న “శ్రీ బాల మానస మహా విద్యాపీఠం – పులుకుర్తి” వారి ఆధ్వర్యంలో ఈ మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా శుక్రవారం గోపూజ, గణపతి పూజ, రిత్విక్ వర్ణము, యాగశాల ప్రవేశం, నవగ్రహ చతు షష్టి క్షేత్రపాలక వాస్తు క్షేత్రపాలక ప్రధాన కలశ స్థాపన గణపతి సహస్ర మోదక హావనము జరిపించారు.
3వ తేదీ శనివారం ప్రాతః కాల మండప పూజలు అనంతరం లక్ష్మీనారాయణ సహిత కమలాత్మిక మహాలక్ష్మి హోమం చేయనున్నారు.
4వ తేదీ ఆదివారం 1,116 మంది దంపతులచే మహాయజ్ఞం అనంతరం పూర్ణాహుతి ఆశీర్వచనం చేయనున్నారు.
హోమం చేయాలనే సంకల్పం కలిగి ఉన్న సామాన్యులకు అందుబాటులో ఉందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ హోమంలో పాల్గొనే వారు రూ. 1516 లు చెల్లించి హోమంలో పాల్గొనవచ్చని తెలిపారు. హోమం లో పాల్గొనేవారు పేరు నమోదు చేసుకోవాలని ట్రస్టు సభ్యులు కోరారు. హోమ సామాగ్రి పూజ సామాగ్రి అంతా ట్రస్ట్ వారే సమకూర్చనున్నారు.