రాజకీయ 'మాయ'లో యువత

Submitted by Mdrafiq on Sat, 03/09/2022 - 12:27
Youth in political 'maya'
  • మందు, బిర్యానిలతో మభ్యపెట్టి 
  • యువకులను వాడుకుంటున్న నేతలు
  • నాయకులను నమ్మి వస్తున్న యువత
  • భవిష్యత్తుపై మాత్రం లేని భరోసా

మెట్ పల్లి, సెప్టెంబర్ 2 (ప్రజాజ్యోతి  ) : - పుట్టిన ప్రతి మనిషి జీవితంలో ఏదైనా సాధించాలంటే అతనికి యుక్త వయసు ఎంతో ప్రధానమైనది. జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని సాధించడానికి చేసే కృషి యుక్తవయసులోనే చేయాల్సి ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు యువతను వినియోగించుకోవడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు యువతను మభ్యపెడుతూ తమ అవసరాలకు వాడుకుంటున్నారు. సరిగ్గా జీవితంలో సెటిల్ అయ్యే వయసులో కొంతమంది రాజకీయ నాయకులను యువత నమ్మి మోసపోతున్న సందర్భాలు ఇటీవల కాలంలో జరుగుతున్నవి. ఎన్నికల సందర్భాల్లో, రాజకీయ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో, ర్యాలీలు నిరసన కార్యక్రమాల్లో యువతను అత్యధికంగా వినియోగించుకుంటున్నారు. 

మందు, బిర్యానిలతో మభ్యపెట్టి

ఎక్కువ మొత్తంలో కొంత మంది యువతను మందు, బిర్యానిలతో మభ్యపెట్టి రాజకీయ నేతలు తమ వెంట తిప్పుకుంటున్నారన్న విమర్శలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. దీంతో తమ బంగారు భవిష్యత్తును సైతం పక్కనపెట్టి తమ నాయకుని సేవలో యువత మునిగితేలుతున్నారు. తమ కోసం విచ్చలవిడిగా ఖర్చు చేసేవారు ఉండడంతో కొంత యువత సైతం వారి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రతీ రోజు తాగడానికి, తినడానికి డోకా లేకపోవడంతో కొంత మంది యువత రాజకీయ నేతల చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. 

యువకులను వాడుకుంటున్న నేతలు

రాజకీయ నాయకులపై, ప్రజాప్రతినిధులపై ఉన్న ప్రేమను, అభిమానాన్ని చాటుకోవడానికి తమ వద్దకు వస్తున్న యువకులను రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు. తెల్లారిలేస్తే ఆ సమయం నుంచి సాయంత్రం వరకు నేతల చుట్టూ తిరుగుతూ తమ సేవలను అందిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం మొదలు ఆయా కార్యక్రమాల నిర్వహణ వరకు అన్ని తామై ముందుండి చూసుకుంటున్నారు. 

భవిష్యత్తుపై మాత్రం లేని భరోసా

రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులను నమ్మి వస్తున్న యువతకు వారి భవిష్యత్తుపై భరోసా మాత్రం కనిపించడం లేదని తెలుస్తోంది. కేవలం తమ వెంట ఉండే కొంతమందికి మాత్రమే ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుస్తూ ఇతర యువతను విస్మరిస్తున్నారన్న విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. కొంత మంది యువత తమ పట్ల వ్యవహరిస్తున్న తమ రాజకీయ నేత యొక్క స్వభావం నచ్చకపోవడంతో దూరంగా ఉండే వారిని గుర్తించి వారిని మచ్చిక చేసుకోకపోవడంతో పాటు కక్ష సాధింపు చర్యలకు సైతం పాల్పడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాము అభిమానించే రాజకీయ నేత లేదా ప్రజాప్రతినిధికి అన్నివిధాలుగా సేవలు అందించినప్పటికీ అవన్నీ మరిచిపోయి తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండడం పట్ల యువత నిరుత్సాహానికి గురవుతున్నారు తెలుస్తోంది. తమ భవిష్యత్తుకు స్పష్టమైన హామీ ఇస్తే తమ అభిమాన నాయకుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండే కొంత మంది యువతను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా యువత రాజకీయ నేతల మాయలో పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పలువురు పేర్కొంటున్నారు.