వచ్చే సంవత్సరం నాటికి మహబూబ్ నగర్ లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం

Submitted by sridhar on Sat, 10/09/2022 - 15:27
We will set up Chakali Ailamma statue in Mahbubnagar by next year
  • పాత పాలమూరులో చాకలి ఐలమ్మ పేరున కమ్యూనిటీ హాల్ పూర్తి చేస్తాం"
  • రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ 

మహబూబ్నగర్, సెప్టెంబర్ 10 (ప్రజా జ్యోతి ప్రతినిధి) : సమాజంలో అనగారిన, పీడిత వర్గాల కోసం పోరాటం చేసిన ధీరవనిత చాకలి ఐలమ్మ ఆని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.  చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్బంగా  శనివారం ఆయన  మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  మహిళ అయినప్పటికీ ఆనాటి భూ పెత్తందారులకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి పోరాడి భర్తను, కుమారున్నీ కోల్పోయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో తాడిత, పీడిత వర్గాల సంక్షేమం కోసం కృషిచేసిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో చాకలి ఐలమ్మ పోరాటపటిమను స్పూర్తిగా తీసుకొని నాయకులు ముందుకు కదిలారని ఆయన వెల్లడించారు. చాకలి ఐలమ్మ ఒక కులానికో, వర్గానికో  కాకుండా సమాజంలోని అనగారిన బడుగు, బలహీన వర్గాల భూమికోసం, భుక్తి కోసం కృషిచేసిన వీరవనిత అని అన్నారు.  మహబూబ్ నగర్ లోని పాత పాలమూరులో చాకలి ఐలమ్మ పేరున కమ్యూనిటీ భవనం నిర్మిస్తున్నామని,వచ్చే సంవత్సరం నాటికి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

హైదరాబాదులో ఆత్మగౌరవ భవన్ కోసం 2 ఎకరాల స్థలంతో పాటు, 5 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. మహిళలు చాకలి ఐలమ్మ ను ఆదర్శంగా తీసుకుని ముందుకు కదలాలని ఆయన పిలుపునిచ్చారు.  మున్సిపల్ చైర్మన్ కే.సి నర్సింహులు, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, డిసిసిబి ఉపాధ్యక్షులు కోరమోని వెంకటయ్య ,జిల్లా రజక సంఘం ప్రతినిధులు,పలువురు ప్రజా ప్రతినిధులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.