భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా అందరిని ఆదుకుంటాం

Submitted by Kramakanthreddy on Fri, 30/09/2022 - 16:41
We will help everyone so that people do not suffer due to heavy rains

జిల్లాలో  వర్షపునీరు, డ్రైయిన్ వాటర్ సులభంగా వెళ్లేందుకు శాశ్వత పరిష్కారం చేస్తాం

 రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి  డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 30 (ప్రజాజ్యోతి ప్రతినిధి) :  గడచిన రెండు రోజుల నుండి మహబూబ్ నగర్ పట్టణంలో ఎప్పుడూ ఊహించని విధంగా 10.7 సెంటిమీటర్ల వర్షపాతం కురియడం వల్ల అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద వర్షం కురిసినందున రామయ్య భౌలి తదితర  లోతట్టు ప్రాంతాలలోని కొన్ని ఇళ్లలోకి నీరొచ్చిందని,ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ పట్టణంలోని రామయ్యాబౌలి, ఎర్రకుంట తదితర లోతట్టు ప్రాంతాల ను సందర్శించారు. వర్షాలు ప్రారంభమైన వెంటనే జిల్లా అధికారులు ,ప్రజాప్రతినిధులు అప్రమత్తమై పట్టణంలో రాత్రి ఆల్మాస్ ఫంక్షన్ హాల్, కురిహిని శెట్టికాలని ,బి కె రెడ్డి కాలనీలలో ప్రత్యేకించి భారీ వర్షాలకు గురైన వారి కోసం షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగిందని, భోజనాలు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. గతంలో మహబూబ్ నగర్ లో వర్షాకాలంలో చెరువులో కనీసం చుక్క నీరు ఉండేది కాదని ,గడచిన ఎనిమిది సంవత్సరాల నుండి వర్షం పెరుగుతూ వస్తున్నదని ,ఇందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం లో జిల్లాలో సుమారు 7% పచ్చదనం పెరిగిందని, దీనివల్ల వర్షాలు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి వర్షాలు వస్తే పట్టణంలో ఇబ్బంది ఏర్పడకుండా వర్షపు నీరు,మురికి నీరు సులభంగా వెళ్లేందుకు శాశ్వత ప్రణాళిక తయారు చేస్తున్నామని, అండర్ గ్రౌండ్ సిస్టం  ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు క్షేమంగా ఉండాలన్నదే తమ అభిమతం అని అన్నారు.

మరో రెండు రోజులపాటు వర్షాలు ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడవద్దని, ఇళ్లల్లో ఉండకుండా తక్షణమే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫంక్షన్ హాల్స్ లో ఉండాలని, అక్కడ భోజన, వసతి, అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. గతంలో మహబూబ్నగర్ పెద్ద చెరువు 365 రోజులు ఆలుగు పారేదని,  వర్షపు నీరు అలుగులో వెళ్లాలి తప్ప మరో అవకాశం లేనందున ఆకస్మిక వర్షాల వల్ల ఇబ్బంది ఏర్పడిందని, దీనిని నివారించేందుకు శాశ్వత మార్గం చర్యలు తీసుకుంటామని తెలిపారు . వర్షాల వల్ల ఇబ్బందిపడుతున్న ప్రజలను ఆదుకునేందుకు జిల్లా యంత్రాంగం 24 గంటలు అందుబాటులో ఉంటుందని, అంతేకాక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేస్తామని, ప్రజలను కాపాడేందుకు  అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ సహకారం అందించాలని అందరివల్లనే విపత్కర సమయంలో ప్రజలను ఆదుకునేందుకు సాధ్యమవుతుందని అన్నారు. జిల్లా కలెక్ట్ ఎస్. వెంకటరావు, జిల్లా ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, వైస్ చైర్మన్ గణేష్, స్థానిక కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ,జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు మంత్రితో పాటు తిరుగుతూ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.