వారసులు వస్తున్నారు... బరిలోకి ధర్మపురి సంజయ్, వేముల రాధిక రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి...

Submitted by SANJEEVAIAH on Sun, 28/05/2023 - 19:13
Photo

వారసులోస్తున్నారు...

అసెంబ్లీ బరిలోకి సిద్ధం

టికెట్ కోసం తహతహ

బలాలపై అధిష్టానానికి వినతి

సన్నిహితులతో మంతనాలు

రేసులో సంజయ్, మల్లికార్జున్, రాధిక రెడ్డి

(నిజామాబాద్ ప్రతినిధి - ప్రజాజ్యోతి - ఎడ్ల సంజీవ్)

డాక్టర్ పిల్లలు డాక్టర్స్... ఇంజనీర్ కుటుంబీకులు ఇంజనీర్స్. యాక్టర్  తరాలు యాక్టర్స్... క్రికెటర్ సంతానం క్రికెటర్స్ కావడమేంతా సహజమో, రాజకీయ నాయకుల వారసులు రాజకీయ నాయకులు కావడం షరా మామూలే. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, తెర పైకి రాజకీయ వారసుల పేర్లు వస్తున్నాయి. ప్రజా క్షేత్రంలో తమ బలాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని కొనసాగించాలని చూస్తున్నారు. తమ తల్లిదండ్రుల, పెద్దల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి సిద్దం అవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రాజకీయ నాయకుల వారసుల సందడి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే కొందరు...

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో నిజామాబాద్  అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, బోధన్ నియోజకవర్గాలు, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి నియోజకవర్గాలు వస్తాయి. దాదాపు 21లక్షల ఓటర్లు ఉంటారు. ప్రస్తుత ఎమ్మేల్యే, ఎంపీల వారసులు కొందరు ఇప్పటికే ప్రజా క్షేత్రంలో వివిధ పదవుల్లో ఉన్నారు. పాత నాయకుల వారసులు కొందరు ప్రజా ప్రతినిధులుగా సేవలు అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఎంపిగా సేవలందించి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలాగే రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి  నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పదవిలో కొనసాగుతున్నారు. 
బిఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన దివంగత వేముల సురేందర్ రెడ్డి వారసుడు వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర మంత్రిగా సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్  పెద్ద కొడుకు ధర్మపురి సంజయ్ ఇప్పటికే నిజామాబాద్ మేయర్ పదవి నిర్వహించారు. చిన్న కొడుకు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారు. ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వారసుడు బాజిరెడ్డి జగన్ ధర్పల్లి జడ్పిటిసిగా కొనసాగుతున్నారు. చౌట్పల్లి హన్మంత్ రెడ్డి వారసత్వాన్ని కే.ఆర్ సురేష్ రెడ్డి ఇప్పటికే ముందుకు తీసుకెళ్లారు. ఉమ్మడి రాష్ట్ర స్పీకర్ పదవితో గుర్తింపు పొందారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 

వచ్చే ఎన్నికల కోసం మరి కొందరు...

వచ్చే సార్వత్రిక, స్థానిక ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న వారసుల జాబితా జిల్లాలో పెరుగుతోంది. వివిధ పార్టీల నుంచి పలు పేర్లు తెర మీదకు వస్తున్నాయి. తమ రాజకీయ అదృష్ట్యా పరీక్షకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే స్థానిక ప్రజా మద్దతు 
కూడగట్టుకుంటున్నారు. అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. రాజకీయ సంబంధాలు నెరపుతున్నారు. సరైన వేదిక కోసం సర్వేలు చేయించుకుంటున్నారు. పై స్థాయిలో లాబీలు చేస్తున్నారు. అసెంబ్లీ టికెట్ పట్టేందుకు తహ తహ లాడుతున్నారు. టికెట్ సాధించేందుకు రకరకాల ప్రయత్నాలకు వెనుకాడటం లేదు.  అధిష్టానం ముందర బల నిరూపణనే లక్ష్యంగా వీళ్ళ కదలికలు ఉంటున్నాయి. ఇలాంటి రాజకీయ వారసత్వ  పరిస్థితుల్లో  కొందరి పేర్లు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వివిధ పార్టీల్లో, ప్రజల్లో చర్చకు దారి తీస్తున్నాయి. 

జోరు పెంచిన ధర్మపురి సంజయ్...

నిజామాబాద్ నగరవాసులకు సుపరిచితమైన వ్యక్తి ధర్మపురి సంజయ్. రాజకీయ ఉద్దండులు, పీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి అయిన ధర్మపురి శ్రీనివాస్ వారసత్వాన్ని పంతోమిదెళ్ళ కిందటే ముందుకు తీసుకెళ్లారు. నిజామాబాద్ కార్పొరేషన్ కు తొలి మేయర్ గా సేవలు అందించారు. నిజామాబాద్ అర్బన్ వాసులకు దగ్గరయ్యారు. స్వంత సామాజిక వర్గమైన మున్నూరుకాపుల్లో తండ్రికితగ్గ తనయుడనే పేరు సంపాదించుకున్నారు. కుల పెద్దల, కులంలో పట్టు పెంచుకున్నారు. కాపుల కంచు కోటయిన నిజామాబాద్ అర్బన్ కు, ప్రస్తుతం సంజయ్ లాంటి నాయకుడు ఎమ్మేల్యే కావాలని కాపులు ముక్తకంఠంతో కోరుకోవడం వెనుక బలమైన కారణమే ఉంది. తండ్రిలా ముందుండి సామాజిక వర్గం కోసం కొట్లడటం ఆయన నైజం. తప్పు చేస్తే కొప్పడ్డా, అన్నం పెట్టే, సహాయం చేసే చేయిగా జనం ఆయనను పొగుడుతారు. అంతేకాకుండా కీలకమైన పద్మశాలి సామాజిక వర్గంలోను సంజయ్ పేరు తెలియని వారుండరు. అంతగా వాళ్ళతో పెనవేసుకుపోయారు. మేయర్ గా ఉన్నప్పుడు కుల భవనాలకు, వివిధ అభివృద్ధి పనులకు నిధులిచ్చి పేరుపెట్టి పిలిచే మద్దతుదారులను పెంచుకున్నారు. నామినేటెడ్ పదవుల్లోనూ పద్మశాలీలకు ప్రాధాన్యత కల్పించారు. అర్బన్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన మైనార్టీల్లో సంజయ్ కి ఉన్న పట్టు, మరెవరికీ లేదంటే అతిశయోక్తి కాదు. తన తండ్రి డీఎస్ అడుగుజాడల్లో పని చేసిన మైనార్టీ నాయకులతోపాటు యువజన మైనార్టీ నాయకులు సంజయ్ రాకను స్వాగతిస్తున్నారు. ఆయన కార్పొరేటర్ గా గెలిచిన 36వ డివిజన్ ఓటర్లు ప్రతి ఎన్నికల్లోనూ ఆయనకు, ఆయన మద్దతు ఉన్న పార్టీకి మెజార్టీ ఇచ్చారు. వీరే కాకుండా ఇతర సామాజిక వర్గాలతోపాటు వ్యాపార వర్గాల మద్దతు ఉండటం సంజయ్ కు కలిసొచ్చే అంశం. అందుకనే నిజామాబాద్ అర్బన్ నుంచి ఆయన కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. ఎమ్మెల్యేగా అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి...

ఏలేటి మహిపాల్ రెడ్డి అన్నపూర్ణమ్మల సంతానమే డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి. ఆర్మూర్ రాజకీయాల్లో కీ.శే మహిపాల్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. మహిపాల్  రెడ్డి దుర్మరణం అనంతరం ఆయన అడుగుజాడల్లో అన్నపూర్ణమ్మ నడిచారు. ఆర్మూర్ ఎమ్మెల్యేగా అన్నపూర్ణమ్మ సేవలు అందించారు. మహిళా ప్రజా ప్రతినిధిగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో చురుగ్గా కొనసాగడం లేదు. కానీ ఆమె వారసత్వాన్ని తనయుడు మల్లికార్జున్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారు. భారతీయ జనతా పార్టీ బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జిగా ఆయన సేవలు అందిస్తున్నారు. అవినీతి, అక్రమాలపై పోరాడుతూ నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, బిజెపి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. బాల్కొండలో పాగవేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బిజెపి ప్రభుత్వంతోనే రైతు సంక్షేమం సాధ్యమని, రైతులకు చేరువయ్యేందుకు కష్ట పడుతున్నారు. ప్రజా సంబంధాలను బలిష్టం చేసుకుంటున్నారు. తల్లితండ్రుల అడుగుజాడల్లో, రాజకీయ సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. తనను గెలిపిస్తే కేంద్ర రైతు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూస్తానని హామీ ఇస్తున్నారు. పసుపు, ఎర్ర జొన్న రైతులను ఆకట్టుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎంపీ అరవింద్ తో సాన్నిహిత్యం, కుటుంబ సంబంధాలు, రాజకీయ వారసత్వ నేపథ్యం తనకు కలిసొస్తాయని ఆశిస్తున్నారు. సర్వేలు,  సమీకరణాల లెక్కలతో కుస్తీ పడుతున్నారు. బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా బాల్కొండలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనే ప్రయత్నాల్లో ఉన్నారు. 

ఉద్యోగం వదిలి... వేముల రాధిక సురేందర్ రెడ్డి...

రాజకీయ కుటుంబం నుంచి రాబోతున్న మరో నాయకురాలు వేముల రాధిక సురేందర్ రెడ్డి. రైతు నేతగా గుర్తింపు పొందిన తండ్రి వేముల సురేందర్ రెడ్డి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని, తండ్రికితగ్గ తనయురాలిగా ముద్ర వేసుకోవాలని పరితపిస్తున్నారు. ఇప్పటికే పోటీపై ఆమె ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లోని పెద్దలను కలిసి తన ఆకాంక్షను వ్యక్తం చేసినట్టు వినిపిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు, స్వచ్చంద ఉద్యోగ విరమణకు సిద్దం అయ్యారని విశ్వసనీయ సమాచారం. తండ్రి వేముల సురేందర్ రెడ్డి అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. విద్యార్థి దశలో విద్యార్థి ఉద్యమ నాయకురాలిగా పని చేయడం తనకు కలిసొస్తుందని వేముల రాధిక సురేందర్ రెడ్డి అంచనా వేస్తున్నారు. కాలేజీ దశలో విద్యార్థి నాయకురాలిగా పని చేసిన తనకు, నాయకత్వ బాధ్యతలు తనకు  భారం కాబోవని ఆమె అనుకుంటున్నట్టు వినికిడి. చదువులో ముందుంటూ హైదరాబాద్ లోని  నిజాం కాలేజీ నుంచి ఎకనామిక్స్ లో  గోల్డ్ మెడలిస్ట్ పొందటం తనకు కలిసొచ్చే అంశమని తలుస్తున్నారు. ఉద్యోగ ధర్మంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంఛార్జి గా పని చేస్తుండటం మరో సానుకూల అంశంగా వేముల రాధిక సురేందర్ రెడ్డి భావిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన 317జీవో రద్దు 
డిమాండ్ తోపాటు వివిధ సమస్యలపై తన పోరాటం ఆయా వర్గాలకు తెలుసని, బలంగా నమ్ముతున్నారు. మహిళగా తోటి మహిళలతో సాన్నిహిత్యం, కలుపుగోలు కలిసొస్తాయని తలుస్తున్నారు. అధిక ఓటర్లు ఉన్నా మహిళల తరపున, ఓ మహిళ నాయకురాలిగా ముందుకు వెళితే, మంచి ఫలితాలు వస్తాయని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. ఒక గోల్డ్ మెడల్ ఎకనామిస్ట్ గా ఆలోచిస్తూ... పేద, మధ్య తరగతి కుటుంబాల తలసరి ఆదాయం పెంచేలా ముందుకు వెళ్ళాలనేది తన కలగా ఆమె చెబుతున్నారు. మౌలిక వసతుల కల్పనతోపాటు ఉపాధి చర్యలు జరిగినప్పుడే ప్రజల ఆదాయం పెరుగుతుందని తాను నమ్మిన సిద్దాంతమని పేర్కొంటున్నారు. తండ్రి వేముల సురేందర్ రెడ్డి గట్టిగా నమ్మిన రైతు సంక్షేమం కోసం ఎంతకైనా పోరాడతానని, సన్నిహితుల వద్ద రాధిక సురేందర్ రెడ్డి అంటున్నట్టు సమాచారం. స్వతహాగా రైతు కుటుంబంలో పుట్టిన తనకు రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందనే విషయం బాగా తెలుసని, అన్నదాతల కష్టనష్టాలు క్షేత్ర స్థాయిలో చూశానని, పలుమార్లు విన్నానని వేముల రాధిక సురేందర్ రెడ్డి చెబుతున్నట్టు తెలిసింది. తాను పుట్టి పెరిగిన బాల్కొండ నియోజకవర్గ సరిహద్దు నియోజకవర్గాలు అయిన నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ లేదంటే బాన్సువాడ నుంచి పోటీ చేయాలని ఆమె ఆలోచనగా సన్నిహితులు చెబుతున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పెద్దలను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.