మునుగోడు గడ్డమీద బిజెపి జెండా ఎగరవేస్తం వరకాంతం జంగారెడ్డి

Submitted by mallesh on Fri, 30/09/2022 - 11:40
Varakantham Jangareddy hoisted the BJP flag on Munugodu Gadda


చౌటుప్పల్ సెప్టెంబర్ 29( ప్రజాజ్యోతి) ./.. ఎన్నికలు వస్తేనే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ప్రజలు గుర్తుకు వస్తారని భారతీయ జనతా పార్టీ నాయకుడు వరకాంతం జంగారెడ్డి అన్నారు. గురువారం దేవలమ్మ నాగారంలో నిర్వహించిన బిజెపి పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి, ప్రజల కష్టాలను  పరిష్కరిస్తున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైపే దేవలమ్మ నాగారం ప్రజలు మొగ్గు చూపుతారన్నారు. ఎన్నికల ముందు హడావిడి చేసే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేగా ఉన్న 5 సంవత్సరాలలో కొయ్యలగూడెం నుండి పీపల్ పహాడ్ గ్రామం వరకు రోడ్డు నిర్మాణం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఉప ఎన్నిక వస్తేనే కూసుకుంట్లకు దేవలమ్మ నాగారం ప్రజలు గుర్తుకొచ్చారా అంటూ ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓడిపోతామని భయంతో దేవలమ్మ నాగారం లో కుల సంఘాలకు భవనాలు నిర్మించి ఇస్తానని మభ్యపెడుతున్నారు. ఎన్నికల సమయంలో వచ్చి ప్రజలకు కల్లబొల్లి మాటలు చెపితే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. గ్రామంలో అన్ని చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే గ్రామ సర్పంచ్, గ్రామపంచాయతీలో కోటి రూపాయల బడ్జెట్ ఉన్న మార్కండేయ కాలనీలో డ్రైనేజీని ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. నోసి ల్యాబ్ పరిశ్రమ నిధులిచ్చి నిర్మిస్తున్న గ్రామపంచాయతీని తానే నిర్మిస్తున్నాం అనడం సిగ్గుచేటు చర్య అన్నారు.

ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన సర్పంచ్ గ్రామ అభివృద్ధికి చేసింది ఏమీ లేదని ఆరోపిస్తూ. గ్రామ ప్రజలు టిఆర్ఎస్ పార్టీ నీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని, నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. దేవలమ్మ నాగారం ప్రజలు భాజపా పార్టీకి బ్రహ్మరథం పలుకుతున్నారని మునుగోడు ఉప ఎన్నిక లో దేవలమ్మ నాగారం గ్రామంలో అత్యధికం ఓట్లు బిజెపికి కట్టబెడతారని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉపఎన్నిక ప్రతిష్టాత్మకమైనదని మునుగోడు గడ్డపై కాషాయపు జెండా ఎగురుతుందని. కెసిఆర్ గడీల రాజ్యాన్ని కూల్చడానికి బాటలు వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహేందర్, అత్తాపురం వెంకట్ రెడ్డి, సుర్కంటి మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.