దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైంది: మంత్రి పువ్వాడ అజయ్

Submitted by Satyanarayana on Tue, 20/09/2022 - 17:25
The time has come to fulfill the dream of decades: Minister

దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైంది

పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తోంది

అధికారులు సమన్వయంతో క్షేత్ర స్థాయిలో పనిచేయాలి 

వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్20 ప్రజాజ్యోతి

రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసిఆర్ నేతృత్వంలో చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. పోడు భూముల సమస్యలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో భాగంగా మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ నుండి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు మంత్రి అజయ్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏండ్లుగా పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ పట్టాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న గిరిజనుల సమస్యకు పరిష్కారం చూపాలని జిల్లా స్థాయి సమన్వయ కమిటీలతో పాటు పోడు భూములకు పట్టాలిచ్చేందుకు వీలుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీవో 140 విడుదల చేశారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. అధికారులంతా సమన్వయంతో  క్షేత్ర స్థాయిలో పర్యటించి పోడు భూములను పర్యవేక్షించి వివరాలు సేకరించాలని ఆదేశించారు.
పోడు రైతులకు పట్టాలు అందితే వారి కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని ఏండ్ల కిందటి సమస్యకు తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసిఆర్ సారథ్యంలో శాశ్వత పరిష్కారం లభించినట్టయిందని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారంతో గిరిజనులకు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు వర్తిస్తాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. సుదీర్ఘమైన పోడు సమస్య శాశ్వత పరిష్కారానికై  ముఖ్యమంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించి, గిరిజనుల్లో ధైర్యం నింపారని, ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు అని అన్నారు. అడవి బిడ్డలకు అడవుల మీద ప్రేమ ఉంటుందని వారి జీవన సంస్కృతి అడవులతో ముడిపడి ఉంటుందన్నారు. అడవులను ప్రాణంగా చూసుకుంటారని వారి జీవికకు అడవుల్లో దొరికే తేనెతెట్టె, బంక, పొయిల కట్టెలు తదితర అటవీ ఉత్పత్తులకు మాత్రమే వారు అడవులను ఉపయోగించుకుంటారని ప్రభుత్వం వారి జీవన హక్కును కాపాడుతుందని మంత్రి తెలిపారు. సమస్య అంతా కూడా బయటి నుంచి పోయి అటవీ భూములను ఆక్రమించి, అటవీ సంపదను నరికి, దుర్వినియోగం చేసేవారితోనేనని వారి స్వార్థానికి అడవులను బలికానివ్వమని స్పష్టం చేశారు. పోడు భూముల సమస్య పరిష్కారమైన మరుక్షణం నుంచే అటవీభూముల రక్షణ కోసం ప్రభుత్వం పటిష్టమైన చర్యలను ప్రారంభిస్తుందని వెల్లడించారు. పోడు రైతుల దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైందని ఏళ్లుగా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న గిరిజనుల పోడు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తోందని అన్నారు. గత ప్రభుత్వాలు పోడు రైతుల గోడును పట్టించుకోలేదని సమస్య పరిష్కారం కోసం కనీసం ఆలోచన కూడా చేయలేదన్నారు.  స్వరాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సీఎం కేసిఆర్ నాయకత్వంలో పోడు రైతుల గోడు తీర్చి, పట్టాలు అందజేయాలని నిర్ణయించిందని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించి, గిరిజనుల్లో ధైర్యం నింపారని చెప్పారు. అన్నమాటకు కట్టుబడి గతేడాది నవంబర్‌ నెలలో గ్రామ గ్రామాన సదస్సులు పెట్టిన అధికారులు పోడు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట శాసనసభ్యులు వనమా వెంకటేశ్వర రావు, హరిప్రియనాయక్, మెచ్చా నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డా వినీత్, ఐటిడిఎ పిఓ గౌతమ్, జిల్లా అటవీ అధికారి రంజిత్ నాయక్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డీఓ మధుసూదన్ రాజు, డిపిఓ రమాకాంత్, డీఆర్వో అశోక్ చక్రవర్తి, ఆర్డీఓ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.