టీ యులో ఆ సారుకు దబిడి దిబిడే... ఆధ్యాపకుల జీతాల లొల్లి... ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక... జీతాలు ఇచ్చిన బాసు

Submitted by SANJEEVAIAH on Wed, 12/04/2023 - 22:17
Telangana University

ఆ సారుకు దబిడి దిబిడే 

టీ యూనివర్సిటీలో జీతాల లొల్లి

 ప్రశ్నించిన అధ్యాపకులు

పెత్తనం చేస్తే సహించమని స్పష్టీకరణ 

లంచాలు అడిగితే ఊరుకోమని హెచ్చరిక 

 ఎంతకైనా రె"ఢీ"నని సవాల్

దిగొచ్చి జీతాలిచ్చిన ఆ బాసు

(నిజామాబాద్ ప్రతినిధి  - ప్రజా జ్యోతి -
ఎడ్ల సంజీవ్)

చెప్పుకుంటే సిగ్గుచేటు... దాచుకుంటే  దయనీయం... అడుగుదామంటే అవమానకరమని భావించి ఇప్పటి వరకు ఆగారు... పాలకులతో కొట్లాడి తెచ్చుకొని.... ఏరికోరి తెలంగాణ పేరు పెట్టుకొని... ఏర్పాటు చేసుకున్న తెలంగాణ యునివర్సిటీలోని ఓ బాసు రోజు రోజుకు బరితెగించడం,  చిల్లర చేష్టలకు పాల్పడటం, ప్రతి పనికో రేటు కట్టడం, పదే పదే పైసలు డిమాండ్ చేయడం, అడుగడుగున అక్రమాలకు పాల్పడటం చూసి ఆ ఉద్యోగులు భరించలేక పోయారు. తెగే వరకు లాక్కున్న పెద్ద సారుకు 'బడి'తే పూజ చేయాలని తిరగబడ్డారు. ప్రశ్నించకపోతే ఫలితం లేదని, తేగిస్తేనే వేధింపులు ఆగుతాయాని, కొట్లాడితేనే కేటుగాళ్లకు బుద్ది చెప్పొచ్చని భావించారు. కాంట్రాక్టు ఉద్యోగులందరు ఏకమై పోరాటానికి దిగారు. సై అంటే సై అంటూ అక్రమార్కుడి ఆగడాలపై  ప్రశ్నలు సంధించారు. న్యాయం కోసం ఎంతకైనా 
రె"ఢీ" అంటూ సవాల్ విసిరారు. దీంతో చావుతప్పి కన్నులు లోట్టబోయిన సదరు సారుకు ఎయిర్ కండీషన్ రూంలోను ముచ్చెమటలు పట్టాయి. మొదటికే మోసం వస్తుందని బెదిరిపోయి, దెబ్బకు దిగొచ్చిన ఆ సారు, ఆపిన జీతాలను 
ఆగమేఘాల మీద సంబంధిత ఉద్యోగుల ఖాతాల్లో మధ్యాహ్నం మూడు గంటలకు జమ చేశాడు. వివరాల్లోకి వెళ్తే....
 
తెలంగాణ యునివర్సిటీకి గత ఏడాది వైస్ ఛాన్స్లర్ గా డాక్టర్ రవీందర్ గుప్తా నియమితులయ్యారు. అప్పటినుంచి యూనివర్సిటీ ఏదో ఒక రూపంలో వివాదాల్లో ఉంటూనే ఉంది. పెద్దలు మందలించిన తీరుమారడం లేదు. తప్పులు సరి చేసుకోవాల్సిందిపోయి, సర్కారుకు చెడ్డ పేరు తెస్తున్నారు. గత నెల జీతాలు ఆలస్యం ఎందుకు అయ్యాయని ఆరా తీస్తే, అడిగినంత సొమ్ము కావాలనే ఆన్సర్ వచ్చిందట. అనవసర రాద్ధాంతం ఎందుకని, పోనీలే అనుకొని, ఇప్పటికే ఎంతోకొంత ముట్టజెప్పినా, మళ్ళీ మళ్ళీ ఇదేం లొల్లి అని తెలంగాణ యూనివర్సిటీలోని కాంట్రాక్ట్ అధ్యాపకులు బుధవారం నిలదీతకు దిగారు. యూనివర్సిటీ పెద్దలను జీతాల నిలుపుదలపై ప్రశ్నించారు. ఓ అధికారిని మధ్యవర్తిగా రాయబారం నెరపిన ఉద్యోగులు ససేమేరా అన్నారు. మళ్ళీ డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. న్యాయం కోసం ఎంతకైనా సిద్ధమని సవాల్ చేశారు. జీతాల కోసం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ వరకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులను కలిసి గోడు వెళ్ళబోసుకుంటామని, మీడియా ముందు తమ బాధలను ఏ కరువు పెడతామని మొహం మీదే చెప్పేశారు. నిరసనల కార్యచరణకు జంగ్ సైరన్ మోగించారు. అక్రమ వసూళ్ల విషయం బయటకు పొక్కితే, మొదటికే మోసం వస్తుందని ఆ పెద్ద సారు గ్రహించారు. ఇప్పటికే పలు ఆరోపణల్లో కూరుకుపోయిన తన సీటుకి, ఎసరు వస్తుందని భయపడ్డారు. తన అక్రమాలు బయటకు వచ్చే అవకాశం ఉందని జంకారు. వెంటనే సిబ్బందిని పిలిచి, కాంట్రాక్టు అధ్యాపకుల ఖాతాల్లో జీతాలు జమ చేశారు. అదేంటో కానీ, అప్పటివరకు ఆగిన జీతాలు, అధ్యాపకుల దెబ్బతో  ఆగమేఘాల మీద వారి ఖాతాల్లో పడటం విశేషం. 

 

తరువాయి భాగంలో...:
తెలంగాణ యునివర్సిటీలోని  ఆ పదకొండు కోట్ల రూపాయలు ఎక్కడ..? అంతా ఆ "సాయికే" తెలుసు.