రాజకీయాలనేవి నిజమైన దేశభక్తులను ప్రోత్సహించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలి.

Submitted by Praneeth Kumar on Sun, 18/09/2022 - 08:30
Politicians should create an environment conducive to fostering true patriotism.

రాజకీయాలనేవి నిజమైన దేశభక్తులను ప్రోత్సహించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలి.

ఖమ్మం అర్బన్, సెప్టెంబర్ 18, ప్రజాజ్యోతి: ప్రతి ఒక్కరు సమయం తీసుకొని చదవండి, చదివి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఒక్కో సినిమాకి 5 కోట్ల నుండి 50 కోట్లు వసూలు చేసే ఈ నటులు, నటీమణులు ప్రజలకు ఏం చేస్తారో ఎవరికి అర్థం కాదు. అగ్రశ్రేణి సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, అధికారులు తదితరులకు ఏడాదికి 10 నుంచి 20 లక్షల రూపాయలు మాత్రమే సంపాదన ఉంటే, అదే దేశంలో ఒక సినిమా నటుడుకి ఏడాదికి 5 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు. అతను ఏమి చేస్తాడు అసలు..?? దేశాభివృద్ధిలో వారి సహకారం ఏమిటి..?? దేశంలోని అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు సంపాదించడానికి 50 ఏళ్లు పడితే కేవలం ఒక్క సంవత్సరంలోనే అంత సంపాదించడానికి వారు ఏమి చేస్తారు. నేడు దేశంలోని కొత్త తరాన్ని ఆకట్టుకుంటున్న మూడు రంగాలు సినిమా, క్రికెట్, రాజకీయాలు. ఈ మూడు రంగాలకు చెందిన వ్యక్తుల సంపాదన, పలుకుబడి అన్ని హద్దులకు అతీతం. ఈ మూడు రంగాలు ఆధునిక యువతకు ఆదర్శాలు, ఐతే వారి విశ్వసనీయత ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉంది. కనుక ఇది దేశానికి, సమాజానికి పనికిరాదు.
సినీ రంగంలో డ్రగ్స్, వ్యభిచారం. క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్, గూండాయిజం. రాజకీయాల్లో అవినీతి. వీటన్నింటికి డబ్బు ప్రధాన కారణం, ఈ డబ్బును వారికి అందించేది మనమే. మన డబ్బును మనమే తగులబెడుతూ మనకు హాని చేసుకుంటున్నాం. ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట.
70-80 ఏళ్ల క్రితం వరకు ప్రముఖ నటీనటులు సాధారణ జీతం పొందేవారు. 30-40 ఏళ్ల క్రితం క్రికెటర్ల సంపాదన కూడా ఎక్కువగా ఉండేది కాదు. 30-40 ఏళ్ల క్రితం రాజకీయాల్లో ఇంత దోపిడి ఉండేది కాదు. మెల్లగా వాళ్ళు మనల్ని దోచుకోవడం మొదలుపెట్టారు, మనం వాళ్ళు దోచుకోవడానికి సహకరిస్తున్నాం. ఈ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకుని మన పిల్లల భవిష్యత్తును, మన దేశాన్ని నాశనం చేసుకుంటున్నాం. 50 ఏళ్ల క్రితం ఇంత అసభ్యంగా, సినిమాలు తీయలేదు. క్రికెటర్లు, రాజకీయ నాయకులు ఇంత అహంకారంతో ఉండేవారు కాదు. ఈ రోజు వాళ్ళు మన దేవుల్లయ్యారు. 'ఇప్పుడు వాళ్ల నిజమైన స్థితిగతులను తెలుసుకునేందుకు వీలుగా వాళ్ల తలని పైకెత్తి చెంపదెబ్బ కొట్టాల్సిన అవసరం ఏర్పడింది'.
ఒకసారి, అప్పటి వియత్నాం అధ్యక్షుడు హోచిమిన్, భారత మంత్రులతో సమావేశానికి భారతదేశానికి వచ్చినప్పుడు 'మీరు ఏమి చేస్తారు..??' అని అడిగారంట. మన వారు చెప్పారు 'మేము రాజకీయాలు చేస్తాము'. ఈ సమాధానం అతనికి అర్థం కాలేదు కాబట్టి మళ్ళీ అడిగాడు 'అంటే, మీ వృత్తి ఏమిటి..??'. వీళ్ళు చెప్పారు 'రాజకీయం మా వృత్తి'. హోచిమిన్‌ కి కొంచెం చిరాకు వచ్చి ఇలా అన్నాడు 'మీకు నా ప్రశ్న అర్థం కాకపోవచ్చు. నేను కూడా రాజకీయాలు చేస్తాను, కానీ వృత్తి రీత్యా నేను రైతును, వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం నా జీవనాధారం, ఉదయం, సాయంత్రం నేను నా పొలాలకు వెళ్లి పని చేస్తున్నాను. పగటిపూట రాష్ట్రపతిగా దేశం కోసం నా బాధ్యత నిర్వర్తిస్తున్నాను'. అదే విషయాన్ని హోచిమిన్ మళ్లీ అడగ్గా, ప్రతినిధి బృందంలోని ఒక సభ్యుడు భుజం తట్టి చెప్పాడు 'రాజకీయాలు మా వృత్తి'. దీనికి మన నాయకుల వద్ద సమాధానం లేదని స్పష్టమైంది. తరువాత, భారతదేశంలో ఆరు లక్షల మందికి పైగా ప్రజల జీవనోపాధి రాజకీయాల మద్దతుతో ఉందని ఒక సర్వే వెల్లడించింది, నేడు ఈ సంఖ్య కోట్లకు చేరిఉంటది. కొన్ని నెలల క్రితం, యూరప్‌లో కరోనా విలయతాండవం చేస్తున్నప్పుడు, వైద్యులు వరుసగా చాలా నెలలు కొంచెం కూడా విశ్రాంతి తీసుకోలేదు, అప్పుడు ఒక పోర్చుగీస్ వైద్యుడు కోపంగా అన్నాడు 'రొనాల్డో దగ్గరికి వెళ్ళు, అతనికి మిలియన్ డాలర్లు ఇస్తారుగా అతని ఆట చూడటానికి. నాకు మాత్రం కొన్ని వేల డాలర్లు మాత్రమే లభిస్తాయి'.
ఏదైనా దేశంలో యువ విద్యార్థుల ఆదర్శం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యావేత్తలు కాకుండా నటులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు అయితే అది వారి సొంత ఆర్థిక పురోగతికి మాత్రమే దోహద పడవచ్చు, కానీ దేశ అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగ పడదని మనం గట్టిగా నమ్మాలి. సామాజికంగా, మేధోపరంగా, సాంస్కృతికంగా, వ్యూహాత్మకంగా దేశం ఎప్పుడూ వెనుకబడి ఉంటుంది. అటువంటి దేశం ఐక్యత, సమగ్రత ఎల్లప్పుడూ ప్రమాదంలో ఉంటుంది. ఏ దేశంలో అనవసర, అప్రస్తుతమైన రంగాల ఆధిపత్యం పెరుగుతుందో, ఆ దేశం రోజు రోజుకూ బలహీనపడుతుంది. దేశంలో అవినీతిపరులు, దేశ వ్యతిరేకుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. నిజాయితీపరులు అట్టడుగున ఉంచబడతారు, కష్టతరమైన జీవితాన్ని గడపవలసి వస్తుంది. ప్రతిభావంతులైన, నిజాయితీ గల, మనస్సాక్షి ఉన్న, సామాజిక కార్యకర్తలు, పోరాట యోధులు, దేశభక్తి గల పౌరులను పెంపొందించడానికి ప్రోత్సహించడానికి అనుకూలమైన వాతావరణాన్ని మనం సృష్టించాలి.