శంకర్‌దాదాల తయారీ కోసమా..!!

Submitted by Praneeth Kumar on Sun, 16/06/2024 - 13:36
Is NEET exam for making ShankarDadas..!!

శంకర్‌దాదాల తయారీ కోసమా..!!

◆ విద్యార్థుల జీవితాలతో చెలగాటం.
◆ బీహార్‌లో పేపర్లు దగ్ధం, గుజరాత్‌లో రూ.2.30 కోట్ల చెక్కుల రికవరీ.
◆ పరీక్షా కేంద్రాల ఎంపికకూ లంచాలు.
◆ నీట్‌ పేపర్ లీక్‌ పై కేంద్రం మౌనం.

హైదరాబాద్, జూన్ 16, ప్రజాజ్యోతి.

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన నేషనల్‌ ఎలిజిబిలిటీి కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌ )పరీక్ష పేపర్‌ లీక్‌ దుమారం రేపుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లెక్కలేనన్ని ఉద్యోగ నియామక పరీక్షలు లీకైతే వాటిని రద్దు చేసి చేతులు దులుపుకున్నారు.
నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) తీరు రోజు రోజుకి వివాదస్పదమవుతోంది. నీట్‌ను సక్రమంగా నిర్వహించామని కేంద్రం ముందు తప్పించుకునే ప్రయత్నం చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆరోపణలన్నింటినీ ఖండించారు. నీట్‌-యూజీలో పేపర్‌ లీకేజీ ఆరోపణలను తోసిపుచ్చిన ఆయన, ‘దీనికి ఎలాంటి ఆధారాల్లేవు. పేపర్‌ లీకేజీకి ఎలాంటి సాక్ష్యాల్లేవు. ఎన్టీఏ పై అవినీతి ఆరోపణలు నిరాధారమైనవి. ఇది చాలా విశ్వసనీయమైన సంస్థ' అని ఎన్టీఏకు క్లీన్‌చిట్‌ ఇచ్చారు.
కానీ, నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారం తీగలాగితే డొంక కదిలినట్టు ఒకటొకటిగా బయటకు వస్తోంది. మొదట పాట్నా, ఇప్పుడు గోద్రాలో పోలీసుల విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూస్తున్నాయి. నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో ఓ టీచర్‌ సహా ఐదుగురిని గోద్రా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

◆ గోద్రా ఎగ్జామ్‌ సెంటర్‌లోనే.
నీట్‌ యూజీ పరీక్షను మే ఐదు న దేశవ్యాప్తంగా ఆయా పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. పరీక్ష రోజు, గుజరాత్‌లోని పంచమహల్‌ జిల్లా కలెక్టర్‌కు పరీక్షా కేంద్రం వద్ద గందరగోళం పై సమాచారం వచ్చింది. పరీక్షా కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్న అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ తుషార్‌ భట్‌ మొబైల్‌ ఫోన్‌ నుంచి 30 మంది అభ్యర్థుల పేర్లు, మొబైల్‌ నంబర్లు లభ్యమయ్యాయి. ఈ 30 మంది అభ్యర్థులకు పరీక్ష ప్రారంభానికి ముందు వీలైనంత వరకు మాత్రమే ప్రయత్నించమని, మిగిలిన షీట్‌లను ఖాళీగా ఉంచాలని తుషార్‌భట్‌ ఉప్పందించారు. మిగిలిన సమాధానాలను ఓఎంఆర్‌ షీట్‌లో తుషార్‌ పూరించినట్టు సమాచారం.

◆ ముగ్గురు ప్రధాన నిందితులతో సహా.
గోద్రాలో ముగ్గురు ప్రధాన నిందితులు సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు తుషార్‌ భట్‌ ఫోన్‌ నుంచి పేపర్‌లీక్‌ సమాచారమిచ్చి విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇది తెలిసిన వెంటనే పరీక్ష రోజునే తుషార్‌ భట్‌ సహా ఐదుగురు నిందితులు, ఇద్దరు ప్రధానోపాధ్యాయులను అరెస్ట్‌ చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. వారందరి బెయిల్‌ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. 30 మంది అభ్యర్థుల తల్లిదండ్రులను కూడా పోలీసులు విచారించారు.

◆ కోట్లల్లో డీల్‌.
నీట్‌ పేపర్‌ లీక్‌ వెనుక రూ.2.30 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఇందులో పాత్రధారులు వెలుగులోకి రాగా సూత్రధారులెవరన్నదాని పై ఇంకా మిస్టరీ కొనసాగుతోంది. అయితే బీజేపీ నేతల హస్తం లేకుండా పేపర్‌ లీక్‌ అసాధ్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి. రారు ఓవర్సీస్‌ యజమాని పరశురామ్‌ రారుకు మెడికల్‌ అడ్మిషన్‌ కోసం విద్యార్థుల తల్లిదండ్రులు చెక్కులు, డబ్బులు అందజేశారు. పరశురామ్‌ రారు చెక్కుల ద్వారా రూ. 2.30 కోట్ల ఆర్థిక లావాదేవీలు నడిపినట్టు పోలీసుల విచారణలో తేలింది.
ఈ కేసులో ఎనిమిది బ్లాంక్‌ చెక్కులు, రూ.2.30 కోట్ల విలువైన చెక్కులు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు కూడా వెలుగులోకి వచ్చాయి. అనుమానిత విద్యార్థులు, తల్లిదండ్రుల వాంగ్మూలాలను కూడా పోలీసులు తీసుకుంటున్నారు. నిందితుల మొబైల్స్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు. డబ్బులు తీసుకుని విద్యార్థులందరినీ నీట్‌ పరీక్షలో ఉత్తీర్ణులయ్యేలా చేయాలన్న కుట్రే ఇదని పంచమహల్‌ ఎస్పీ హిమాన్షు సోలంకి తెలిపారు.
ఢిల్లీ హైకోర్టు సహా ఏడు హైకోర్టుల్లో నీట్‌ పరీక్ష కేసుల పై దాఖలైన పిటిషన్లను బదిలీ చేయాలని జూన్‌ 14 న ఎన్టీఏ సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసింది. వీటిలో ఒక పిటిషన్‌లో నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌ పై సీబీఐ విచారణకు డిమాండ్‌ చేశారు. ఈ పిటిషన్‌లో, పెద్ద ఎత్తున పేపర్‌ లీక్‌ల సంఘటనలను ఉటంకిస్తూ, కావాల్సిన పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవడానికి అనుసరిస్తున్న వ్యూహాల గురించి కూడా ప్రస్తావించి మరీ దండుకున్నట్టు తేలింది.

◆ ఆ మూడు రాష్ట్రాల విద్యార్థులు కోరుకున్నట్టుగా.
ఉదాహరణకు ఒడిశా, జార్ఖండ్‌, గుజరాత్‌ వంటి రాష్ట్రాల విద్యార్థులు నీట్‌ పరీక్షకు హాజరయ్యేందుకు గుజరాత్‌లోని గోద్రాలో ప్రత్యేక కేంద్రాన్ని ఎంచుకున్నారు. గోద్రాలోని ప్రత్యేక కేంద్రమైన జై జల్‌ రామ్‌ స్కూల్‌ను తమ కేంద్రంగా ఎంచుకోవడానికి రూ.10 లక్షలు లంచం ఇచ్చారు.

◆ ఎన్టీఏ సహకారం అందిస్తుందా..??
పోలీసులు ఎన్టీఏ నుంచి అవసరమైన సమాచారం కోరారు. ఈ విద్యార్థులకు ఈ పరీక్షా కేంద్రాన్ని ఎలా కేటాయించారని ఎన్టీఏ అధికారులను అడిగారు..?? అసలు మొత్తం ప్రక్రియ ఏమిటి..?? సిబ్బందిని ఎలా కేటాయించారు..?? సిబ్బంది ఎంపిక ప్రక్రియ ఏమిటి..?? అంటూ ప్రశ్నలు సంధించారు. ప్రస్తుతం ఎన్టీఏ నుంచి ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాగానే ఎంపికలోనే స్కామా లేక పరీక్షలోనే స్కామ్‌ జరిగిందా అనేది తేలిపోనుంది.
బీహార్‌లో కాలిన పేపర్లు లభ్యం
బీహార్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్న పేపర్లు, ఇవి లీకైన కాగితాలా కాదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదని, దీనికి సంబంధించి ఎన్టీఏ ఎటువంటి సమాధానం ఇవ్వలేదని బీహార్‌ పోలీసులు అంటున్నారు. మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ నుంచి బీహార్‌కు పేపర్‌ వచ్చినట్టు విచారణలో తేలింది. మూలాలను విశ్వసిస్తే, రవాణా సమయంలో పేపర్‌ లీక్‌ అయింది. వీటితో పాటు బీహార్‌ పోలీసులు లీకైన ప్రశ్న పత్రాలు కాలిపోయినట్టు కూడా గుర్తించారు. పేపర్‌ లీక్‌ కేసులో 13 మందిని అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన వారిలో కొందరు అభ్యర్థుల బంధువులు, బ్రోకర్లు కూడా ఉన్నారు. నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో పలువురు నిందితులు పోలీసుల వద్ద నేరం ఒప్పుకున్నారు.

◆ విద్యార్థులు హెచ్చరిస్తున్నా.
నీట్‌ పరీక్షలో మొదటి నుంచి అక్రమాలు జరుగుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. పేపర్‌ లీక్‌ పై విద్యార్థులు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినా పరీక్ష ఆపలేదు. ఇప్పుడు గ్రేస్‌ మార్కులు వచ్చిన 1563 మంది విద్యార్థులకు జూన్‌ 23న మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించడంతో విద్యార్థుల ఆగ్రహం మరింత పెరుగుతోంది. ఎన్టీఏ తన తప్పును దాచుకునేందుకే ఇలా చేసిందని, దీని వల్ల 23 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరగబోదన్నారు.