"మహబూబ్ నగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో నేటి నుండి మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు ప్రారంభం"

Submitted by Kramakanthreddy on Tue, 27/09/2022 - 12:59
"Mahbub Nagar Government Main Hospital to start knee replacement surgeries from today"
  •  "శస్త్ర  చికిత్సల యూనిట్ ను ప్రారంభించిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్"
  • "ప్రభుత్వ  ప్రధాన ఆసుపత్రికి 4 కోట్ల రూపాయలతో నూతన క్యాథ్ ల్యాబ్ మంజూరు"
  • " త్వరలోనే గుండెకు సంబంధించి యాంజియో, బైపాస్ సేవలు ప్రారంభించనునట్లు మంత్రి వెల్లడి "

 మహబూబ్ నగర్, సెప్టెంబర్ 26 (ప్రజాజ్యోతి ప్రతినిధి) :    కేవలం కార్పొరేట్ ఆసుపత్రులలో మాత్రమే నిర్వహించే మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సలు ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం అయన మహబూబ్ నగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సలకు  సంబంధించిన యూనిట్ ను ప్రారంభించారు . ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇప్పటివరకు మహబూబ్ నగర్ జిల్లాలో మోకాలు మార్పిడి  శస్త్ర  చికిత్సకు సంబంధించిన ఇంప్లాంట్స్ లేక పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారని, ఈరోజు నుండి ఈ సేవలు అందుబాటులోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చాలామంది భయంతో మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సలను చేయించుకునేందుకు ముందుకు వచ్చేవారు కాదని, ఇప్పుడు మహబూబ్ నగర్లోనే ఇలాంటి సేవలు అందుబాటులోకి రావడం వల్ల అందరికీ ఎలాంటి ఇబ్బంది లేదని,ఇందుకు ఆయన డాక్టర్లను అభినందించడమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తాము గ్రామాలు సందర్శించినప్పుడు ప్రతి గ్రామంలో కనీసం 10 మంది మొకాలి నొప్పితో బాధ పడేవారు కనిపించేవారని, ఈరోజు నుండి ఇక్కడే ఆసుపత్రిలో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహిస్తున్నందున పేద ప్రజలందరూ దీనిని వినియోగించుకోవాలని ఆయన కోరారు. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి సంబంధించిన ఇంప్లాంట్స్  మోకాలు మార్పిడి శస్త్ర  చికిత్సలో వినియోగించడం జరుగుతుందని తెలిపారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రి అంటే  అందరికీ నిర్లక్ష్యం ఉండేదని, నేను రాను బిడ్డో సర్కారు దవఖానకు అనే పరిస్థితి నుండి ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు పూర్తి నమ్మకం కలిగించామని తెలిపారు. త్వరలోనే పాత కలెక్టర్ స్థానంలో 500 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించనున్నామని ,అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి అన్ని రకాల చికిత్సలకు వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తామని, సంవత్సరంలో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

ఇకపై పేదలు వైద్యం కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని, అన్ని రకాల చికిత్సలను మహబూబ్ నగర్ లోనే అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు . ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు నర్సులు సిబ్బంది  ప్రజలకు నమ్మకం కలిగించాలని, వైద్య సేవలపట్ల ఎవరు నిర్లక్ష్యం వహించవద్దని, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.  మహబూబ్ నగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మోకాలు మార్పిడి శస్త్ర చికిత్స తో పాటు, ఇకపై గుండెకు సంబంధించిన బైపాస్ వంటి చికిత్సలను కూడా త్వరలోనే అందించబోతున్నామని ,ఇందుకుగాను 4 కోట్ల రూపాయలతో క్యాథ్ ల్యాబ్ మంజూరు అయిందని, దీనిని త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అంతకు ముందు మంత్రి ఆర్థో వార్డులో మోకాలు మార్పిడి శస్త్ర చికిత్స మార్పిడి వైద్యం కోసం వచ్చిన చిన్నారెడ్డి, సరోజ, లక్ష్మీ దేవిలతో మాట్లాడుతూ ఎలాంటి భయం లేదని, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ పరికరాలు వాడుతున్నామని చెప్పారు. మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, ఆసుపత్రి సలహా సంఘం సభ్యులు లక్ష్మీ , మల్లేష్, సత్యం యాదవ్ ,ఆస్పత్రి  పర్యవేక్షకులు డాక్టర్  రామ్ కిషన్, డాక్టర్ తులసీరామ్, డాక్టర్ వినోద్, డాక్టర్ జీవన్ , మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు, కిషన్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.