నిర్లక్ష్యపు నీడలో జైనుర్ ప్రభుత్వ ఉర్దూ పాఠశాల

Submitted by Degala shankar on Fri, 23/09/2022 - 12:37
Jainur Govt Urdu School in shadow of neglect
  • 300 మంది విద్యార్థులు... ముగ్గురే ఉపాధ్యాయులు..
  • -కానరాని బయోమెట్రిక్ యంత్రం
  • -ఉన్న కంప్యూటర్లు మాయం
  • -నేటికీ అందని పాఠ్యపుస్తకాలు
  • -అస్తవ్యస్తంగా పాఠశాల నిర్వహణ
  • -ఆందోళనలో విద్యార్థులు
  • -పట్టించుకోనని అధికారులు

జైనూర్ సెప్టెంబర్ 22, (ప్రజా జ్యోతి) ..///... జైనూరు మండల కేంద్రంలో ఉన్న ఉర్దూ ప్రభుత్వ పాఠశాల పాలకులు, అధికారుల నిర్లక్ష్యపు నీడలో కొన సాగుతుంది. ఈ పాఠశాల లో 300 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలలో కేవలం ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. అన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలవుతుండగా ఇక్కడ అవేమి కానరావడం లేదు. విద్యార్థులకు చదువుతోపాటు కంప్యూటర్ పై అవగాహన ఉండాలని ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి కంప్యూటర్లు సరఫరా చేసినా అవి మాయమయ్యాయి. సుమారు 300 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా నేటికీ పాఠ్యపుస్తకాలు అందలేదు. ఒకవైపు మాకు సక్రమంగా చదువు అందడం లేదని విద్యార్థులు ఆందోళన చెందుతుండగా మరోవైపు ప్రభుత్వం ద్వారా అయినా కంప్యూటర్ల తో సహా బయోమెట్రిక్ యంత్రం లాంటివి మాయం అవడం పట్ల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు మాత్రం ఈ విషయంలో పట్టించుకోవడం లేదని ఆరోపణలు సర్వత్ర వినిపిస్తు న్నాయి.మండల కేంద్రంలోని వీకర్ సెక్షన్ కాలనీలో ఒకే ఒక ప్రభుత్వ ఉర్దూ పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో సుమారు 300 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి బోధించేందుకు కేవలం ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. ఇద్దరూ రెగ్యులర్ ఉపాధ్యాయులు ఉండగా డబోలి పాఠశాల నుండి నుండి తెలుగు సబ్జెక్ట్ కోసం డిప్యూటేషన్ పై మరో ఉపాధ్యాయుడు ఈ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం ముగ్గురు ఉపాధ్యాయులు కాగా ఈ ముగ్గురు నుండి ఓ ఉపాధ్యాయుడు డిప్యూటేషన్ పై వేరే ప్రాంతానికి వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారుల నుండి అనుమతి కూడా పొందినట్లు సమాచారం. ఇలా అయితే ఇప్పటికే 300 మంది విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు బోధిస్తుండగా కేవలం ఇద్దరు విద్యార్థులతోనే ఈ 300 మంది విద్యార్థులకు బోధన అందించాల్సి వస్తుందని పోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధ్యాయుల సమయపాలన పర్య వేక్షణకు అన్ని ప్రభుత్వ పాఠశాలలో బయోమెట్రిక్ విధానం అమలులో ఉంది. కానీ ఈ పాఠశాలకు కూడా బయోమెట్రిక్ యంత్రం సరఫరా అయింది. కానీ అది ఇప్పుడు కానరావడం లేదు. ఈ విషయంలో వివరణ కోరగా మరమ్మత్తు కోసం పంపించా మని ఉపాధ్యాయులు బదులిచ్చి చేతులు దులుపు కున్నారు. మరోఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పాఠశాల కోసం ప్రభుత్వం ద్వారా ఆరు కంప్యూటర్లు సరఫరా అయ్యాయి. కానీ అవన్నీ మాయమై కేవలం మూడు కీబోర్డులు, ఒక సిపియు మాత్రమే దర్శనమిస్తుంది. వీటన్నింటినీ గమనిస్తే పాఠశాల ఏవిధంగా కొనసాగుతుందనే విషయం స్పష్టమవుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని, మాయమైన కంప్యూటర్లు, బయోమెట్రిక్ యంత్రం రాబట్టుకోవాలని, నాలుగు నెలలుగా అందని పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందేలా చూడాలని పోషకులు కోరుతున్నారు.