కో ఆపరేటివ్ శాఖలో పగులుతున్న పాపాల పుట్ట... బ్రాహ్మణపల్లి సొసైటీ బాటలోనే మరికొన్ని సొసైటీలు... మిగతా సొసైటీల అవినీతిపరులైన చర్యలు ఎప్పుడో మరి.?

Submitted by SANJEEVAIAH on Fri, 06/01/2023 - 07:53
ఫోటో

పగులుతున్న పాపాల పుట్ట

 కో-ఆపరేటివ్ శాఖలో అవినీతి జలగల గుట్టు వీడేది ఎప్పుడు

 చక్రం తిప్పుతున్న ఆ అధికారిపై నిఘా వర్గాల దృష్టి 

బ్రాహ్మణపల్లి మాజీ చైర్మన్ అరెస్ట్

 అదే బాటలో మరి కొంతమంది

( నిజామాబాద్ ప్రతినిధి - ప్రజాజ్యోతి - ఎడ్ల సంజీవ్)

 నిజామాబాద్ జిల్లాలోని కోఆపరేటివ్ శాఖ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో (పి ఎ సి ఎస్)లో అవినీతి పాలకులు, అధికారుల గుట్టు బయటపడనుంది. గత నెలలోనే "ప్రజాజ్యోతి" దినపత్రిక "పాపాల పుట్ట పలికేదెప్పుడో.?" అని పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కోవలోనే ఎట్టకేలకు బ్రాహ్మణపల్లి సొసైటీలో జరిగిన రూ.88 లక్షల అవినీతి ఆరోపణలపై మాజీ చైర్మన్ తెల్లన్న అలియాస్ కాటిపల్లి గంగారెడ్డి మాజీ సీఈవో సురేందర్ రెడ్డిలను జక్రాన్ పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇదే దారిలో అవినీతి పాపాల పుట్టలో నుంచి మరికొన్ని పాములు బయటపడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డి సి ఓ కార్యాలయంలోని సబ్ రిజిస్టార్లు మరికొన్ని సొసైటీలపై విచారణ పూర్తి చేసి డిసిఒకు నివేదికలు అందజేశారు. ఇదే శాఖలోని ఉద్యోగ సంఘం నాయకుడు మూడు సొసైటీలలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణ ఎదుర్కొంటున్నారు వాటిపై విచారణ చేసి అప్పటికి ఆ విచారణ నివేదికను బయటపడకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. బ్రాహ్మణపల్లి సొసైటీ బాటలోనే ప్రస్తుతం తాళ్ళరాంపూర్, బాల్కొండ, హోన్నజీపేట, మాధవనగర్, పాల్దా, ఎత్తుండ, కొత్తపల్లి సొసైటీలలోను అవినీతి ఆరోపణల గుట్టు మూసుకొని ఉంది. వీటిపై ఇప్పటికే సంబంధిత అధికారులు విచారణ పూర్తి చేసి సొసైటీ యాక్ట్ చట్టం 50, 51 సెక్షన్ లలో నోటీసులను జారీ చేశారు. తదుపరి ఫైనల్ విచారణకు జిల్లా కోపరేటివ్ అధికారి కార్యాలయంలో ఫైనల్ కొనసాగాల్సి ఉంది. అయితే ఈ విచారణలు రకరకాల కారణాలతో వాయిదాలు పడుతూ నెలల తరబడి జాప్యం జరుగుతోంది. దీనివల్ల రైతుల సొమ్మును నొక్కేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి జలగలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ కోవలోనే జక్రాన్ పల్లి మండలం బ్రాహ్మణపల్లి సొసైటీకి చెందిన మాజీ చైర్మన్, మాజీ సీఈఓల తీరు తెలిసిందే. సొమ్ము రికవరీ కాకపోవడంతో ఎట్టకేలకు పోలీస్ కేసు నమోదు చేసి రిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఇప్పటికే మాధవ నగర్ సొసైటీలోని మాజీ సి ఈ వో పై నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. రికవరీలోనూ జాప్యం జరుగుతా ఉంది. అయితే సదరు ఉద్యోగి పదవి విరమణ పొందారు. మరోవైపు హోన్నాజీపేట సొసైటీలో ఇప్పటికే రెండు లక్షల రూపాయల మేరకు రికవరీ అయింది. మిగతా డబ్బులు రికవరీ కావలసి ఉంది. ఇక తాళ్లరాంపూర్ సొసైటీ విషయానికి వస్తే కోట్లల్లో అవినీతి జరిగిన సదరు వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించి తప్పించుకున్నట్లు తెలుస్తుంది.  నిబంధనల మేరకు సంబంధిత పాలక వర్గం లేదా విచారణ అధికారుల నిర్ణయాధికారి మేరకు పోలీస్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని రాజకీయ వ్యవహారాల కారణంగా చర్యలకు అధికారులు వెనుకడుగు వేస్తున్నట్లు సైతం ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ జిల్లా చరిత్రలోనే ఓ సొసైటీ లో పనిచేసిన మాజీ చైర్మన్, మాజీ సీఈఓ లను అరెస్టు చేయడం ఇటు అధికారులు, అటు రాజకీయ వర్గాలలో చర్చానియాంశముగా మారింది. ఇదిలా ఉంటే మరోవైపు రాజకీయ కారణాల రీత్యా చర్యలలో జాప్యం జరుగుతుందని ఆరోపణలు సైతం ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ చట్టం తన పని చేసుకో పోతుంది అనేది వాస్తవం. ఇందుకు బ్రాహ్మణపల్లి సొసైటీలో జరిగిన అవినీతి అక్రమాల తీరుపై అరెస్టుల పర్వమే ప్రధాన సాక్ష్యం.