మహబూబ్ నగర్ లో భారీ వర్షం.

Submitted by Ashok Kumar on Fri, 30/09/2022 - 12:13
Heavy rain in Mahbubnagar.

-- లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం 
-- 10-15 సెంటి మీటర్ల  పైగా వర్షం నమోదు.
-- అప్రమత్తమైన అధికార యంత్రాంగం . 
-- సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు. 

మహబూబ్ నగర్ బ్యూరో ప్రజా జ్యోతి న్యూస్ సెప్టెంబర్ 29: మహబూబ్ నగర్ లో భారీ వర్షం  కారణంగా  లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇండ్లలోకి నీరు చేరింది . వాహనాలు కొట్టుకుపోయాయి.  పట్టణంలో 3గంటల పాటు భారీ వర్షం కురిసింది  భారీ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. 10 నుండి 15 సెం.మీ. వర్షపాతం నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. అసిస్టెంట్ ఇంజనీరింగ్ టౌన్ 3 సెక్షన్ కార్యాలయం దగ్గర చెట్టు పై పిడుగు పడ్డట్లు తెలుస్తుంది.  రోడ్లపైకి వరద రావడంతో ట్రాఫిక్ కు  అంతరాయం ఏర్పడింది. రామయ్య బౌలి, కురువి శెట్టి కాలనీ, బి కే రెడ్డి కాలనీ  ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి ఇండ్ల లోకి నీరు చేరింది. దీంతో అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంతాల  ఇండ్లలోకి నీరు చేరడంతో సామాన్లన్నీ తడిసిముద్దయ్యాయి.పెద్ద చెరువు ప్రాంతంలోని లోతట్టు ప్రాంతంలో వర్షపు నీటి ప్రవాహం నుండి ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ, తగిన చర్యలు తీసుకునేందుకు సిబ్బందిని పురమాయిస్తున్న జిల్లా అధికారులు. ఆర్.వెంకటేశ్వర్లు  అడిషనల్ కలెక్టర్ , తేజస్ నందలాల్  ,ఇతర అధికారులు ఈ ప్రాంతాలను పరిశీలించారు.అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు , సిబ్బంది కౌన్సిలర్లు. పురాతన ఇండ్లలో ఉండే వాళ్ళను అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కొంట్రల్ రూమ్ ఏర్పాటు చేసి ఆహార సౌకర్యాలు  అందించేందుకు కృషి చేస్తున్నారు.ఎవ్వరికీ హాని జరగకుండా ఉండేలా చర్యలు చేపట్టారు.