భారీ వర్షం పై అప్రమత్తం

Submitted by Kramakanthreddy on Fri, 30/09/2022 - 13:22
Heavy rain alert
  •  
  • - లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించాలని ఆదేశించిన మంత్రి
  • - రంగంలోకి మున్సిపల్ చైర్మన్, అడిషనల్ కలెక్టర్,  జిల్లా ఎస్పీ ఇతర అధికారులు
  • - అహ్మదాబాద్ నుంచి పర్యవేక్షించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 29 (ప్రజాజ్యోతి ప్రతినిధి) : భారీ వర్షాల ప్రభావం వల్ల మహబూబ్ నగర్ లోతట్టు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఎక్సైజ్, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి.  శ్రీనివాస్ గౌడ్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. గురువారం రోజు సుమారు మూడు గంటల పాటు కుండపోత వర్షం కురిసిన సమాచారం తెలిసిన వెంటనే ఆయన అధికారులను అప్రమత్తం చేశారు.36వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి గుజరాత్ లోని అహ్మదాబాద్ వెళ్లిన రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అక్కడి నుంచే పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాలైన రామయ్య బౌలి, బికే రెడ్డి కాలనీ, వల్లబ్ నగర్, శివశక్తి నగర్ తదితర ప్రాంతాల్లో అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్, అగ్నిమాపక, మున్సిపల్, పోలీస్ సిబ్బంది మంత్రి ఆదేశాలతో హుటాహుటిన లోతట్టు ప్రాంతాలకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఒక్కసారిగా 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం కురవడం వల్లే ఎగువ నుంచి భారీగా వర్షపు నీరు వచ్చిందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలెవరు ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని,  అవసరమైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. సిబ్బంది నిరంతరం లోతట్టు ప్రాంతాల కాలనీ ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి సమస్య లేకుండా చూడాలన్నారు.