గురుకుల పాఠశాలలు ఇతర పాఠశాలలకు ఆదర్శంగా ఉండాలి

Submitted by Kramakanthreddy on Thu, 08/09/2022 - 09:55
Gurukul schools should be a role model for other schools
  • స్వచ్ఛతకు మారుపేరుగా, విద్యలో దీటుగా నిలవాలి

  జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు ; మహబూబ్నగర్, సెప్టెంబర్ 7 (ప్రజా జ్యోతి ప్రతినిధి) : గురుకుల పాఠశాలలు , కళాశాలలు ఇతర అన్ని పాఠశాలలకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు అన్నారు.స్వచ్ఛ గురుకుల వారోత్సవంలో భాగంగా బుధవారం అయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని రామిరెడ్డి గూడ వద్ద ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ  గురుకుల పాఠశాల, కళాశాల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాలలో పరిశుభ్రతను, మొక్కల పెంపకాన్ని,పాఠశాల ఆవరణలో పరిశుభ్రత, వంటగది, డైనింగ్, తరగతి గదులు అన్నింటిని తనిఖీ చేశారు.

విద్యార్థులు, ఉపాధ్యాయులు ,అధ్యాపకులతో విడివిడిగా ముఖాముఖి మాట్లాడారు. పాఠశాలలో విద్య ,భోజనం, తదితర అంశాలపై విద్యార్థులను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. అంతేకాక వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.రామ్ రెడ్డి గూడ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో వసతులు, విద్య అన్ని బాగున్నాయని, అయితే పాఠశాలలో ఇంకా అక్కడక్కడ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని, వంటగది ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని,పాఠశాల ఆవరణ కూడా శుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, ఎల్లప్పుడూ విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించడం పైనే దృష్టి పెట్టాలని, గురుకుల పాఠశాలలు విద్య విషయంలో ఇతర పాఠశాలలకు దీటుగా ఉంటూ, ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు.

పాఠశాల ఆవరణలో ఇంకా మరిన్ని మొక్కలు పెంచాలని ,అవసరం అయితే పెద్ద పెద్ద మొక్కలు తెచ్చి నాటించాలని ఆదేశించారు . గురుకుల పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. పక్కనే వాటర్ ప్లాంట్ ద్వారా  వస్తున్న  వృధా నీటి వల్ల ఇబ్బంది ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా దానిపై ప్రత్యేక దృష్టి ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.  కాగా రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలలో వారం రోజులపాటు స్వచ్ఛ గురుకుల కార్యక్రమాన్ని పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేర బుధవారం అయన రామిరెడ్డి గూడ గురుకులాన్నీ సందర్శించి పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు.

 ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన వారం రోజుల షెడ్యూల్ ను ప్రతి పాఠశాల తప్పనిసరిగా పాటించాలని, షెడ్యూల్ లో పేర్కొన్న విధంగా కార్యక్రమాలను చేపట్టాలని ఆయన ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు తెలిపారు. టాయిలెట్ లతో పాటు, పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులు అనారోగ్యం పాలు కాకుండా వంటగది శుభ్రంగా ఉండాలని, నాణ్యమైన భోజనం అందించాలని, అదేవిధంగా చదువు విషయంలో కూడా రాజీ లేకుండా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆయన సూచించారు. డి ఆర్ డి ఓ యాదయ్య, ఆర్ సి ఓ ఫ్లోరెన్స్ రాణి, పాఠశాల ,కళాశాల ప్రిన్సిపల్ శ్రీవాణి, మహబూబ్ నగర్ గ్రామీణ తహసిల్దార్ పాండు నాయక్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.