జీజీహెచ్ లో జడ్పీ చైర్మన్ కే జలక్.... ప్రమాద ఘటనపై స్పందించని సూపరింటెండెంట్... జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు....

Submitted by SANJEEVAIAH on Thu, 20/04/2023 - 23:11
Photo

*జడ్పీ చైర్మన్ కే జలక్*

ప్రమాద ఘటనపై ఫోన్ చేస్తే స్పందించని సూపరింటెండెంట్ 

గంటన్నరకు స్పందించిన తీరు

 వేచిచూసి ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళిన వైనం

ఇడ్చుకెల్లిన ఘటన మరువక ముందే మరో సంఘటన

జిల్లా కలెక్టర్ కు గ్రామస్థుల ఫిర్యాదు

వెలుగు చూడనివి ఇంకాఎన్నో

(నిజామాబాద్ ప్రతినిధి - ప్రజాజ్యోతి - ఎడ్ల సంజీవ్)

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేక దృష్ట్రి పెట్టింది. కోట్ల రూపాయాలు ఖర్చు చేసి మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెస్తే ఆసుపత్రి పాలక వర్గాల తీరుతో ఆసుపత్రులు అభాసు పాలవుతున్నాయి. ఇందుకు నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) వేదిక అయింది. ఈనెల 1న సంఘటనపై విచారణ జరిగిన రెండో రోజున మరో ఘటన జరగడం అంటే ఆసుపత్రిలో పాలక వర్గం, వైద్యుల పని ఎలా ఉందో అర్థం చేసుకవచ్చు. ఏకంగా బుధవారం రాత్రి జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావుకు జిల్లా ఆసుపత్రి వైద్యులు జలక్ ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకున్ని ఆసుపత్రి తీసుకు వచ్చిన విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమ రాజ్ కు ఫోన్ చేస్తే స్పందించలేదు. గంటన్నర తరువాత స్పందించి ఫోన్ చేస్తే అప్పటికే గాయపడిన వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇదొకటి అనుకుంటే పొరపాటే సుమా. ఎంతో మంది బాధితులు ఉన్న బయట పడటం లేదు. ముఖ్యంగా ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ (హెచ్ డీ సీ) లేకపోవడం, జూనియర్లకు పర్యవేక్షణ బాధ్యత ఇవ్వడం, రోగుల బాధ్యతలు మరచిపోయి నిత్యం పబ్లిసిటీ కోసం పరితపించడం, ప్రజా ప్రతినిధులను స్మరించుకునే పనిలో పడటంతో జీజీహెచ్ నిర్వహణ గాలికి వదిలేసినట్లు అవుతుంది. 

ఇది కొనసాగుతున్న తీరు..

జడ్పీ సమావేశంలో సాక్షాత్తు జడ్పీ చైర్మన్ విఠల్ రావు ఏప్రిల్ 1న జరిగిన ఘటనపై స్పందించి ఆసుపత్రిలో సేవలు అందుతున్నాయని, ఎవరో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అన్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే అదే రోజు రాత్రి జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు సూపరింటెండెంట్ ప్రతిమ రాజ్ కు ఫోన్ చేస్తే స్పందించలేరు. సరిగ్గా గంటన్నర తరువాత స్పందించి రిటన్ కాల్ చేశారు. అప్పటికే ప్రమాద బాధితుడిని కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. దీనిపై కుటుంబ సభ్యులు జడ్పీ చైర్మన్ కు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు ఫిర్యాదు చేశారు. బాధితులు నిరసన తెలిపి సిబ్బందిని మందలించిన స్పందన లేకుండా పోయింది. అంటే జిల్లాకు తలమానికం అయిన జీజీహెచ్ సూపరింటెండెంట్ ఫోన్ కాల్ స్పంచకుంటే వైద్యుల పరిస్థితి ఏమిటి.? ఇదే విషయమై "ప్రజాజ్యోతి" దిన పత్రికలో "వాడని ప్రభుత్వ ఫోన్ నంబర్" అని కథనం కూడా ప్రచురణ చేసింది. 24 గంటలు అందుబాటులో ఉండాల్సిన అధికారుల ఫోన్ నంబర్ల అసిస్టెంట్స్ వద్ద ఉండటం అసలు సమస్య. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదులు వెళ్ళిన ఇటు అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకొకపోవడం విశేషం.

బయట పడకుండా ఉండేందుకు...

జీజీహెచ్ లో ఏ సంఘటన జరిగిన పత్రికలలో రాగానే మరుసాటి రోజు నుంచి ఆ సంఘటనను మరిచి పోవాలని కొత్త కోణం వెతుకుతారు.  అందు కోసం ప్రారంభోత్సవ, ప్రచార ఆర్భాటం చేస్తున్నారు తప్పా అసలు సమస్యను పరిష్కరించడంలో విఫలం అవుతున్నారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కల్పించాల్సిన, ఆ విషయాన్ని వదిలేసి ఆసుపత్రి అధికారులు అర్భటాలతో కాలం వెల్లదియడం పరిపాటిగా మారింది. అసలు విషయాలు ప్రజా ప్రతినిధులు, జిల్లా పాలన అధికారుల దృష్ట్రిలో పడటం లేదు. దీంతో ఆసుపత్రిలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మారింది.

పాలక వర్గం లేనట్లేనా ?

ఏరియా ఆసుపత్రిలకు, జిల్లా ఆసుపత్రి తరహాలో జిల్లా జనరల్ ఆసుపత్రికి పాలక వర్గం లేకపోవడమే అసలు సమస్య. దీంతో ఆసుపత్రికి ప్రభుత్వం కేటాయించిన నిధులు ఎన్ని.? ఎవరి అనుమతితో ఎలా ఖర్చు చేస్తున్నారు.? వాటి పర్యవేక్షణ ఎవరు చూస్తారు అనేది ఎక్కడ లెక్క లేదు. పాలక వర్గం లేకపోవడంతో ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు అయింది. గతంలో జిల్లా కలెక్టర్ కన్వీనర్ గా, స్థానిక ఎమ్మెల్యే లేదా మంత్రి చైర్మన్ గా జిల్లా ఆసుపత్రిపై పర్యవేక్షణ ఉండేది. ఇప్పుడు అది లేకపోవడం, ఎంసీఐ కంట్రోల్లో ఉండటంతో అడ్డు అదుపు లేకుండా పోయింది. దీనికి తోడు సుమారు అయిదేళ్లుగా ఇంచార్జి సూపరింటెండెంట్ పాలనలోనే ఆసుపత్రి కొనసాగుతుంది. సీనియర్ వైద్యులకు జూనియర్ వైద్యులకు మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమన్నట్లు ఉంటుంది. జూనియర్ వైద్యురాలుకి సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పగించడం విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రెగ్యులర్ సూపరింటెండెంట్ పోస్టు ఇచ్చినప్పటికీ సదురు అధికారిని నిజామాబాద్ రాకుండానే పంపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే పేరుకే పెద్దాసుపత్రి... లోపల అంతా దుస్థితి అంటున్నారు రోగులు. ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన అధికారుల పని తీరుతో ఆసుపత్రులు అభాసుపాలవుతున్నాయి.

 

చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేస్తాం

బి అర్ ఎస్ నాయకుడు తెడ్డు పోషేట్టి

గురువారం రాత్రి జరిగిన ఘటనపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేస్తాం. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాం. ఆ రోజు జడ్పీ చైర్మన్ కు చెప్పాం ఆయన ఫోన్ చేసిన ఎవరు స్పందించ లేదు. మా ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తే కొందరు అధికారుల పర్యవేక్షణ వల్ల ఆసుపత్రికి వచ్చే రోగులకు న్యాయం జరగడం లేదు. దీనిపై విచారణ చేయాలని రోగులకు ఆసుపత్రిలో న్యాయం జరగాలని కోరుతున్నాం.