సివిల్ కాంట్రాక్ట్ లో సమాన రిజర్వేషన్ కల్పించాలి

Submitted by Gonela Kumar on Tue, 06/09/2022 - 17:32
Equal reservation should be provided in civil contract
  • తెలంగాణ వడ్డెర కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 

  పంజాగుట్ట,సెప్టెంబర్ 6 (ప్రజాజ్యోతి): తెలంగాణలో వడ్డెరలకు సివిల్ కాంట్రాక్ట్ లో ఎస్సీ, ఎస్టీ, సగరలతో సమానంగా రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ వడ్డెర కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్జప్తి చేసింది. మంగళవారం  సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు ఎస్  రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వడ్డెరలు మొత్తం 40 లక్షలకు పైగా జనాభా ఉన్నారని, రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ శాఖలైన ఆర్ అండ్ బి, జి హెచ్ఎంసి, ఇరిగేషన్,మున్సిపాలిటిల్లో 65శాతం పైగా వడ్డెరలు సివిల్ వర్క్ చేస్తున్నారని పేర్కొన్నారు.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇరిగేషన్ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్లు జివో నెం. 440,  జి.వో నెం 275, జివో నెం. 398, సర్క్యులర్ నెం.1362/కె జీ  చేశారని, అప్పుడు సివిల్ వర్క్ రిజర్వేషన్ గా 15% ఉండేదన్నారు. (ఎస్సి, ఎస్టి,వడ్డెర సొసైటీ ఇండివిడ్యువల్స్), ఇఎండి 20 లక్షల వరకు అవకాశముండేదని గుర్తుచేశారు. కానీ తెలంగాణ గవర్నమెంట్ జారీ చేసిన జీవో29తో సగరసొసైటీ కులస్థులను కూడా కలుపుతూ అదే 15శాతం ఇస్తూనే 50 లక్షలు వరకు ఎగ్జిమ్ ఇచ్చారన్నారు. అయితే 2018 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 59 లో రిజర్వ్ వర్క్స్ 24శాతంను ఎస్సి,15శాతం ఎస్టి ,6శాతం, వడ్డెర సగర కులస్తులకు గాను 3శాతం నిర్ధారించి జారీ చేశారు. ఆ జీఓ ప్రకారం  వడ్డెరలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. వడ్డెరలు బిల్డింగులు కట్టుట, రోడ్లు వేయడం, కెనాల్స్, బావులు తవ్వుడం ,పెద్ద పెద్ద డ్యాములు కట్టడం చేస్తారు.

ఈ పనులే వడ్డెరలకు జీవనాధారం, బ్రతుకు తెరువు, నాటి నుండి నేటి వరకు కూడా ఈ పనులు చేస్తూనే జీవనం సాగిస్తున్నామన్నారు. కావున ముఖ్యమంత్రి  మా కరుణ చూపి వడ్డెరలకు సివిల్ కాంట్రాక్టుల్లో 24శాతం రిజర్వేషన్ మిగతా మూడు కులాలైన ఎస్సీ, ఎస్టీ, సగర కులస్తులతో సమానంగా ఇప్పించాలని, జీఓ నెంబర్ 59 ను సవరిస్తూ మరొక నూతన జీఓను జారీ చేయాలని విజ్జప్తి చేస్తున్నామన్నారు. అలాగే మైనింగ్ డిపార్ట్మెంట్లో రిజర్వేషన్ ను 10శాతం నుంచి 20  శాతానికి పెంచాలని కోరారు. ఈ సమావేశంలో  తెలంగాణ వడ్డెర కాంట్రాక్టర్స్  వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎస్ వెంకటస్వామి ,చీఫ్ అడ్వైసర్స్  తుర్క నరసింహ,జనరల్ సెక్రెటరీ జి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ కుమార స్వామి,  కొమురమళ్ళు,వెంకటేశ్వర్లు  ,జనార్దన్  కళ్యాణ్ కుమార్, డి యాదగిరి, అంజయ్య , జి వెంకట్రావు పాల్గొన్నారు.