ధాన్యం కొనుగోలుపై లీడర్లు వర్సెస్ మిల్లర్లు... కల్లాల్లోనే 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం... రైతు గోస అలకించరేమి.?

Submitted by SANJEEVAIAH on Mon, 08/05/2023 - 07:24
Photo

కష్టం....నష్టం

లీడర్లు వర్సెస్ మిల్లర్లు


 ఆపదలో అన్నదాత


కల్లాల్లోనే 5లక్షల మె.ట ధాన్యం


 రైతు గోస ఆలకించరేమి?


బాధ్యులపై విమర్శల జడివాన 

*(నిజామాబాద్ - ప్రజాజ్యోతి - అరిగెల యోగేశ్వర్)*

అనుకూలంగా ఉన్నప్పుడు ఎగబడి  తీసుకున్నారు. అన్నదాత ఆపదలో ఉంటే ధాన్యం తీసుకోరా? తమాషా చేస్తున్నారా. ఏది ఏమైనా తడిసిన ధాన్యం తీసుకోవాల్సిందే. తూకం వేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేయొద్దు. లేదు కాదంటే చర్యలు తప్పవు. కోటగిరి మార్కెట్ కమిటీ అంతర్గత సమావేశంలో 
అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రైస్ మిల్లర్లకు చేసిన హెచ్చరిక ఇది.

 కేటాయింపుల మేరకు తూకం వేసిన, తడిసిన ధాన్యం వెంటనే మిల్లర్లు తీసుకెళ్లాలి. రైతులను ఇబ్బంది పెడుతున్న పద్మావతి రైస్ మిల్లును బ్లాక్ లిస్ట్ లో పెట్టండి. కాపర్తి, ఎల్జి, రుద్ర, త్రివేణి రైస్ మిల్లుల యాజమాన్యాలకు పద్దతి మార్చుకోమ్మని చెప్పండి. వినకుంటే వారిపై సైతం కఠిన చర్యలు తీసుకోండి. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశం.
- రైతులు వస్తే తలతిక్క సమాధానం ఇస్తారా? మేము చెప్పిన వినరా? తడిసిన ధాన్యం ఎందుకు తీసుకోరంటూ కోపంతో ఊగిపోయిన కామారెడ్డి ఎమ్మేల్యే గంప గోవర్ధన్.

ఆడబిడ్డ పెళ్లికి సరిపడా డబ్బులు వస్తాయని....వైద్య ఖర్చులకు సరిపడా నగదు అందుతుందని... ఇంకా పిల్లల ఫీజులకు ఇబ్బంది ఉండబోదని...కొత్త వస్తువులు కొందామని ప్రణాళికలు వేసుకున్న అన్నదాతల ఆశలు అంతలోనే అడియాశలయ్యాయి. ప్రకృతి కోపానికి వరి సిరులు చేజారాయి. తడిసిన ధాన్యం మొలకెత్తింది. తూకం వేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉండిపోయింది. మిల్లర్లు తడిసిన ధాన్యం కొనబోమని మొండికేశారు. దీంతో రైతులకేమి దిక్కుతోచక, దీనావస్థలో సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మిల్లర్లకేమో వ్యాపారం తప్పా, మరేం పట్టడం లేదు. ప్రజా ప్రతినిధుల మాటను సైతం, తుంగలో తొక్కుతున్నారు.  సమన్వయం చేసి,  సమస్య తీర్చాల్సిన అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. దున్నపోతుల కొట్లాటలో లేగ దూడల కాళ్ళు విరిగినట్టు ప్రజా ప్రతినిధుల, రైస్ మిల్లర్ల పోరులో చి"వరి"కి రైతే బలి అవుతున్నాడు.

@ ఇది పరిస్థితి:
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరి పంటకు ప్రసిద్ది. ప్రతి సీజన్ లో సుమారు 15లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయి. ఇందులో దాదాపు 12లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. కొనుగోళ్ల కోసం  డి ఆర్ డి వో, పి ఎ సి ఎస్ శాఖల ద్వారా కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. సేకరించిన ధాన్యాన్ని, లేవి బియ్యం కోసం కేటాయించిన మిల్లులకు తరలిస్తోంది. ధాన్యం సేకరణ చేసినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే కమీషన్ డి ఆర్ డి వో, పి ఎ సి ఎస్ శాఖలకు వెళుతుంది.  ధాన్యం కేటాయింపుల మేరకు, రేషన్ బియ్యాన్ని మిల్లర్లు కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. రైస్ మిల్లింగ్ చేసినందుకు, మిల్లర్లకు కమిషన్ అందిస్తారు. ఈ వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోపాటు మిల్లర్ల, లారీ యజమానుల, అధికార యంత్రాంగ సహకారం చాలా అవసరం. ఇక్కడే సమన్వయం కొరవడి, కర్షకుడికి కష్టాలు తప్పడం లేదు.  

@ మిల్లర్ల ఇష్టారాజ్యం:

ప్రభుత్వాలకు, రైతులకు మధ్యలో ఉన్న రైస్ మిల్లర్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. కనీస బాధ్యత లేకుండా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది. పెద్ద మిల్లర్ల లాభాపేక్ష, వ్యవస్థకు ప్రాణ సంకటంగా మారింది. తమకే సాధ్యమైన నేర్పులతో, ఇప్పటికే కావల్సినంత మంచి ధాన్యం సేకరించుకున్నారు. మెచ్చిన రీతిలో యంత్రాంగాన్ని ఒప్పించి, మొదట్లోనే కేటాయింపులు చేసుకొని, తతాంగం పూర్తి చేశారు. ఇప్పుడేమో తడిసిన ధాన్యం కొనుగోలు చేయబోమని మొండికేస్తున్నారు. గతంలోని హామీ మేరకు నూక బియ్యం పేరిట మూడు, నాలుగు కిలోల తరుగు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ఇస్తే, తరుగు పెంచేలా పథకం రచించారు. ఫలితంగా దండిగా లాభాలు దండుకోవచ్చని కుట్ర పన్నారు. రైతన్నలకు ఆగ్రహం వచ్చేలా,  రాజకీయంగా సైతం ఎత్తులు వేశారు. అందుకే కాలయాపన చేస్తూ, కల్లాల్లోనే ధాన్యం ఉండేలా వ్యూహ రచన చేశారు. దీంతో ధాన్యం తడిసి, అన్నదాత ఆగం అయ్యాడు.

@ సై అంటే సై:

ప్రజా ప్రతినిధుల హెచ్చరికలకు మిల్లర్లు సై అంటే సై అంటున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మిల్లర్లను  హెచ్చరించిన గంటల్లోనే, ధాన్యం కొనబోమని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు లేఖను అందజేశారు. మిల్లర్ల కు చెందిన వ్యక్తిపై, ఎమ్మేల్యే గంప గోవర్ధన్ చేయి చేసుకున్న గంటల్లోనే  మిల్లర్ల సంఘం నిరసన తెలిపింది. దీంతో  ఇరువురి వ్యవహారం కాస్తా, చిలికి చిలికి గాలి వానలా మారుతోంది. ఇది ఇక్కడికి దారి తీస్తుందో తెలియడం లేదు. నువ్వా? నేనా కొట్లాటలో రైతుల పరిస్థితి దైన్యంగా తయారైంది. 

@ ఎక్కడివి అక్కడే:

సుమారు 12లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణలో ఇప్పటికీ సగం ధాన్యం మాత్రమే సేకరణ జరిగింది. ఇంకా 6లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, 
కల్లాల్లోనే  ఉంది. ఇందులో చాలా ధాన్యం తడిసి ముద్దయింది. తూకం వేసిన కూడా, తరలింపుకు నోచుకోకపోవడంతో  ఈ సమస్య ఎదురయింది. మిల్లర్ల ఇష్టారాజ్యం, అధికారుల వైఫల్యం కలగలిసి దైన్య పరిస్థితులు నెలకొన్నాయి. ఇకనైనా పరిస్థితుల్లో మార్పు రాకుంటే, అన్నదాతల ఆగ్రహం చవి చూడక తప్పదు. మరి బాధ్యతాయుత వ్యవస్థలు సమన్వయంతో ముందుకు వెళతాయో, లేదంటే పరిస్థితులను చేయి దాటిస్తాయో వేచి చూడాల్సిందే.